nuts: నట్స్ ను నచ్చిన సమయంలో తీసుకోవద్దు.. ఈ సమస్యలుంటే అసలే వద్దు..

  • ఇవి పోషకాల గనులు
  • పరిమితంగా తీసుకుంటే మంచి ఫలితాలు
  • పోషకాల లేమికి మంచి పరిష్కారం
  • జీర్ణాశయ సమస్యలున్న వారు తీసుకోకూడదు
Health experts rules to consume nuts dos and donts best time to eat

నట్స్ తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. వీటిల్లోని ప్రొటీన్, విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థం ఇవన్నీ కూడా మధుమేహం, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయని, బరువు తగ్గడానికి సాయపడతాయని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. నట్స్ ను (బాదం, జీడి పప్పు, ఎండు ఖర్జూర, పిస్తా, వాల్ నట్ తదితర) తీసుకోవడం వల్ల చాలా సమయం పాటు ఆకలి వేయదు. ఇది కూడా ఒకందుకు మంచిదే.


నట్స్ ను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. జీర్ణపరమైన సమస్య ఏర్పడొచ్చు. మితంగానే తీసుకోవాలి. ఆయుర్వేదం సైతం ఆరోగ్య ప్రయోజనాల కోసం నట్స్ ను తీసుకోమనే చెప్పింది. నట్స్ లో విటమిన్ ఈ, క్యాల్షియం, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, రిబోఫ్లావిన్ ఉంటాయి. అలాగే, ఐరన్, పొటాషియం, జింక్, బీ విటమిన్లు అయిన నయసిన్, థైమిన్, ఫొలేట్ లభిస్తాయి. వీటిని రోజువారీ తీసుకోవడం వల్ల ఇన్నేసి పోషకాలను శరీరానికి అందించొచ్చు. వీటిని అతిగా తీసుకోకూడదు. అలాగే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కూడా వీటిని తినకూడదు.

ఎలా తీసుకోవాలి..?
ఆయుర్వేదం చెబుతున్న దాని ప్రకారం.. నట్స్ లో ఆరోగ్యానికి హాని చేయని ఫ్యాట్, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. అందుకని నట్స్ ను 6-8 గంటల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. పైన పొట్టును తొలగించి తినాలి. అప్పుడు అందులోని పోషకాలను శరీరం చక్కగా తీసుకోగలదు. నానబెట్టుకోవడం వీలు కాని వారు వేయించిన రూపంలో నట్స్ తీసుకోవచ్చు. 

ఏ సమయంలో అనుకూలం..?
ఉదయం లేచిన తర్వాత నానబెట్టిన నట్స్ ను తీసుకోవడం మంచి అనుకూల సమయం. అప్పటి వరకు లివర్ విశ్రాంతి లో ఉంటుంది. మొదట తీకుకునే ఆహారం కావడంతో అందులోని పోషకాలన్నీ చక్కగా శరీరానికి అందుతాయి. అప్పుడు వీలు పడని వారు మధ్యాహ్నం సమయంలో భోజనానికి ముందు, సాయంత్రం స్నాక్ కింద తీసుకోవచ్చు.

ఎంత మొత్తం తీసుకోవచ్చు..?
జీర్ణ శక్తి మంచిగా  ఉన్నవారు, రోజువారీగా వ్యాయామం చేసేవారు, తగినంత నీరు తీసుకునే వారు, ఎటువంటి వ్యాధులు లేని వారు నట్స్ తీసుకోవచ్చు. అది కూడా ఒక గుప్పిటలో పట్టేంత పరిమాణంలో రోజువారీగా తినొచ్చు.

దుష్ప్రభావాలు 
నట్స్ లో 80 శాతం ఫ్యాటే ఉంటుంది. కనుక ఇవి తేలికగా, వేగంగా జీర్ణం కావు. కడుపుకు మందంగా అనిపిస్తాయి. బరువు పెరుగుతారు. ఆకలి కూడా  అనిపించకపోవచ్చు.

వీరికి నట్స్ వద్దు..
జీర్ణశక్తి సరిగ్గా లేని వారు, జీర్ణాశయ సమస్యలు ఎదుర్కొంటున్న వారు, అసిడిటీ, జీఈఆర్డీ, డయేరియా, ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నవారు, నట్స్ అంటే పడని వారు వాటికి దూరంగా ఉండాలని వైద్యుల సూచన.

More Telugu News