మస్క్ వచ్చాడు.. ఉద్యోగాలు ఊడిపోతాయేమో: భయంభయంగా ట్విట్టర్ ఉద్యోగులు

01-05-2022 Sun 08:15
  • దాదాపు 4,400 కోట్ల డాలర్లతో ట్విట్టర్ కొనుగోలు
  • ఉద్యోగాలపై ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను నిలదీసిన ఉద్యోగులు
  • భయం వద్దంటూ ఉద్యోగులకు పరాగ్ భరోసా
Twitter CEO faces employee anger Over Musk attacks at company wide meeting
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఉద్యోగులు భయంభయంగా గడుపుతున్నారు. ట్విట్టర్ త్వరలోనే ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సొంతం కాబోతోంది. దాదాపు 4,400 కోట్ల డాలర్లతో ట్విట్టర్‌లోని షేర్లన్నింటినీ మస్క్ ఇటీవల సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్విట్టర్ ఉద్యోగుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనన్న భయం వారిలో కనిపిస్తోంది. అంతేకాదు, శుక్రవారం కంపెనీ అంతర్గత టౌన్‌హాల్‌ మీటింగులో ఇదే విషయమై ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను ఉద్యోగులు నిలదీసినట్టు ‘గార్డియన్‌’ ఓ కథనంలో పేర్కొంది. 

ట్విట్టర్ మస్క్ చేతికి వెళ్లాక కంపెనీలో సామూహిక వలసలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలంటూ పరాగ్‌ను ఉద్యోగులు నిలదీసినట్టు ఆ కథనం పేర్కొంది. అయితే, అలాంటిదేమీ ఉండదని ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలిపింది. కాగా, ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం పూర్తైన తర్వాత ట్విట్టర్ ప్రైవేటు కంపెనీగా మారుతుంది. మరోవైపు, ట్విట్టర్ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం మస్క్ ఈ వారంలో 850 కోట్ల డాలర్ల (రూ.65,025 కోట్లు) విలువైన టెస్లా షేర్లను విక్రయించారు.