తన ప్రత్యర్థుల నుంచి రెండో భార్యకు ముడుపులు అందాయన్న ఇమ్రాన్ ఖాన్... ఘాటుగా బదులిచ్చిన రెహామ్ ఖాన్

  • పాక్ లో రాజకీయ యుద్ధం
  • ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్
  • ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించిన వైనం
  • మాజీ భార్యల పేరెత్తకుండా వ్యాఖ్యలు 
Imaran Khan comments on his ex wives

ఇటీవల అవమానకర రీతిలో పదవీచ్యుతుడైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన తన మాజీ భార్యలు జెమీమా గోల్డ్ స్మిత్, రెహామ్ ఖాన్ ల గురించి ప్రస్తావించారు. అయితే, ఎక్కడా తన మాజీ భార్యల పేరెత్తకుండానే వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని షరీఫ్ ముఠా తనపై రంజాన్ తర్వాత విమర్శల దాడికి పన్నాగం రూపొందించిందని ఇమ్రాన్ వెల్లడించారు. తన పరువు ప్రతిష్ఠలను మంటగలపడమే షరీఫ్ ముఠా ముఖ్య ఉద్దేశమని అన్నారు. గతంలో బేనజీర్ భుట్టో పట్ల కూడా ఈ ముఠా ఇలాగే వ్యవహరించిందని తెలిపారు. 

అంతేకాదు, తన మొదటి భార్య జెమీమా గోల్డ్ స్మిత్ గురించి చెబుతూ... "ఇస్లాం మతం స్వీకరించి పాకిస్థాన్ లో అడుగుపెట్టిన ఓ మహిళ పట్ల ఇదే ముఠా దుష్ప్రచారం చేసింది. ఆమెను వారు యూదు జాతీయురాలు అని ఆరోపించారు. ఓ తప్పుడు కేసు పెట్టి ఏడాదిపాటు ఆమెను ఇబ్బందులకు గురిచేశారు" అని ఇమ్రాన్ ఖాన్ వివరించారు. లండన్ కు చెందిన జెమీమా గోల్డ్ స్మిత్ ను ఇమ్రాన్ ఖాన్ 1995లో పెళ్లాడారు. అయితే, వారు 2004లో విడిపోయారు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ పాత్రికేయురాలు రెహామ్ ఖాన్ ను పెళ్లాడారు. ఈ పెళ్లి కూడా విఫలమైంది. 

తాజాగా, తన విమర్శల పర్వంలో రెహామ్ ఖాన్ వ్యవహారాన్ని కూడా ఇమ్రాన్ ఎత్తిచూపారు. మళ్లీ ఇదే మాఫియా నాకు వ్యతిరేకంగా పుస్తకం రాయాలని 2018 ఎన్నికలకు ముందు ఓ మహిళకు ముడుపులు చెల్లించింది అని ఆరోపించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా రెహామ్ ఖాన్ పేరు ప్రస్తావించకపోయినా, అది తన గురించే అని అర్థం చేసుకున్న రెహామ్ ఖాన్ ఘాటుగా స్పందించారు. 

"అతడిని పెళ్లి చేసుకున్నందుకు, ఏడాదిపాటు కాపురం చేసినందుకు కూడా నాకు ముడుపులు ఇచ్చారేమో దయచేసి అతడినే అడగండి" అంటూ కౌంటర్ ఇచ్చారు. "లేక, ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉండమని అతడికే ఏమైనా ముడుపులు ఇచ్చారా? ఏదేమైనా ఇదొక అనుమానపు జబ్బు (పారనోయియా)!" అంటూ రెహామ్ ఖాన్ వ్యాఖ్యానించారు.

More Telugu News