Chandrababu: వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని మా ఇంటిని లాక్కున్నారు: ఎంపీ నందిగం సురేష్ సోదరిపై చంద్రబాబుకు తాడేపల్లి వాసి ఫిర్యాదు

Tadepalli couple complained against MP Nadigam suresh sister to Chandrababu
  • చిట్టీల పేరుతో ఏవో కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు
  • ఇప్పుడేమో రూ. 6 లక్షలు ఇచ్చామని, తిరిగి ఇవ్వాలని బెదిరిస్తున్నారు
  • మూడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి ఆరు నెలల క్రితం ఆస్తి ఆమె పేరున ఎలా రాస్తారన్న బాధితులు
  • తమకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారన్న తాడేపల్లి వాసి
వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతూ ఎంపీ నందిగం సురేష్ సోదరి తమ ఇంటిని బలవంతంగా లాక్కున్నారంటూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఉప్పు పిచ్చయ్య-భవానీ దంపతులు ఆరోపించారు. ఈ మేరకు నిన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పార్టీ కార్యాలయంలో కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ భూమిని లాక్కున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఎంపీ సోదరి మనుషులు తమ ఇంట్లోని సామాను తీసుకెళ్తుంటే వీడియో తీసిన తమ కుమారుడిని చంపేందుకు యత్నించారని ఆరోపించారు.

చిట్టీలు వేస్తున్నామని వచ్చి తమతో ఏవో కాగితాలపై సంతకం చేయించుకున్నారని, ఆపై తమకు రూ. 6 లక్షలు ఇచ్చామని, వాటిని తిరిగి ఇవ్వాలని బెదిరిస్తున్నారని వాపోయారు. పార్టీ కోసం ఇల్లు ఖాళీ చేయకుంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారన్నారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో రౌడీషీటర్లతో కలిసి ఇంటికొచ్చి తాళం పగలగొట్టి మూడున్నర కాసుల బంగారు గొలుసు, రూ. 15 వేల నగదు, బ్యాంకు చెక్ బుక్కులు, సామాన్లు తీసుకెళ్లారని ఆరోపించారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఆమె నుంచి తాను రూ. 6 లక్షలు తీసుకోవడం తాను కూడా చూశానని తాడేపల్లి సీఐ చెబుతున్నారని బాధిత దంపతులు పేర్కొన్నారు. మూడు సంవత్సరాల క్రితం తన తండ్రి చనిపోతే ఆరు నెలల క్రితం ఆస్తిని ఆమె పేర రాసినట్టు కాగితాలు సృష్టించారని వాపోయారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని చెప్పారు.
Chandrababu
Tadepally
Nandigam Suresh
Andhra Pradesh
YSRCP

More Telugu News