Omicron: బీహార్ లో ‘ప్రమాదకర’ కొత్త వేరియంట్ కలకలం.. దేశంలో మళ్లీ పెరుగుతున్న మహమ్మారి

  • ఒమిక్రాన్ బీఏ.12 వేరియంట్ కేసు నమోదు
  • జన్యుక్రమ విశ్లేషణ ద్వారా గుర్తించిన వైద్యులు
  • ఇది పది రెట్లు ప్రమాదకరమైందన్న ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్
  • దేశంలో నిన్న మరో 3,377 మందికి పాజిటివ్
  • 60 మందిని బలి తీసుకున్న మహమ్మారి 
Bihar Detects First Case Of Dangerous Omicron BA 12 Case

దేశంలో కరోనా మహమ్మారి నాలుగో వేవ్ భయాలు నెలకొన్న వేళ.. బీహార్ లో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ లోని ఉపరకం బీఏ.12 తొలి కేసు నమోదైంది. ఒమిక్రాన్ (బీఏ.2) కన్నా ఇది పది రెట్లు ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. అంతే వేగంగా జనాలకు సోకుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కరోనా సోకిన ఓ వ్యక్తి శాంపిల్ కు పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్)లో జన్యు క్రమ విశ్లేషణ చేయగా బీఏ.12 పాజిటివ్ గా వెల్లడైందని అధికారులు చెప్పారు. 13 శాంపిళ్లు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలగా.. అందులో 12 శాంపిళ్లు బీఏ.2 అని, ఇంకొకటి వేగంగా వ్యాపించే గుణం ఉన్న బీఏ.12 అని గుర్తించారు. 

ఈ ఉపరకం కరోనా చాలా ప్రమాదకరమైందని ఐజీఐఎంఎస్ మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ నమ్రత హెచ్చరించారు. ఇతర ఒమిక్రాన్ ఉప రకాలతో పోలిస్తే దీని సంక్రమణ శక్తి చాలా చాలా రెట్లు ఎక్కువని ఆమె తెలిపారు. వాస్తవానికి ఈ ఉపరకం తొలి కేసును తొలుత అమెరికాలో గుర్తించారు. గత వారం ఢిల్లీకీ పాకాయి. మూడు కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు బీహార్ లోనూ వెలుగు చూసింది. 

మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 3,377 మంది కరోనా బారిన పడ్డారు. అంతకుముందు రోజు 3,303 కేసులు నమోదవగా.. ఇవాళ 74 కేసులు ఎక్కువగా వచ్చాయి. పెరుగుతున్న కేసులతో పాటే యాక్టివ్ కేసులూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 17,801 మంది ఇంకా మహమ్మారి కారణంగా బాధపడుతున్నారు.

తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4,30,72,176కు పెరిగాయి. నిన్న 60 మంది మహమ్మారికి బలవగా.. మొత్తం మరణాల సంఖ్య 5,23,753కి చేరాయి. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఇప్పటిదాకా 193.28 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను వినియోగించినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. 5 నుంచి 12 ఏళ్ల వారికి కరోనా టీకాలను ఇచ్చే విషయంపై ఇవాళ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

More Telugu News