TDP: త‌న‌పైకి దూసుకువ‌చ్చిన రాయిని చూపుతూ వైసీసీ స‌ర్కారుకు నారా లోకేశ్ వార్నింగ్‌

  • తుమ్మ‌పూడిలో హైటెన్ష‌న్‌
  • టీడీపీ శ్రేణుల‌పై వైసీపీ రాళ్ల దాడి
  • దాడిపై లోకేశ్ ఫైర్‌
  • ఎవ‌రికీ భయ‌ప‌డేది లేద‌ని ఉద్ఘాట‌న‌
  • నిందితుల‌పై చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వానికి 21 రోజుల డెడ్‌లైన్‌
nara lokesh angry over stone pelting of ysrcp

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండ‌లం తుమ్మ‌పూడి గ్రామంలో త‌న‌పైకి వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి య‌త్నించిన తీరుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తుమ్మ‌పూడికి చెందిన మ‌హిళ‌ హత్యకు గురికాగా...బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు గురువారం సాయంత్రం లోకేశ్ గ్రామానికి వెళ్లారు. 

ఈ సంద‌ర్భంగా టీడీపీ, వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై లోకేశ్ అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామర్శించేందుకు వ‌చ్చిన త‌న‌పై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగాయ‌న్న లోకేశ్... ఈ త‌ర‌హా దాడుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు. 

త‌మ‌పైకి వైసీపీ కుక్క‌లు రాళ్లు రువ్వాయ‌ని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై రాళ్ల దాడి జ‌రుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప‌ది మంది ఆందోళ‌న‌కారుల‌ను కూడా అడ్డుకోలేని ప‌రిస్థితిలో పోలీసులు ఉన్నారంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా రాళ్ల దాడిలో భాగంగా త‌న మీద‌కు దూసుకువ‌చ్చిన రాయిని చూపుతూ పోలీసుల‌పై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

హ‌త్యాచార బాధితురాలి మృత‌దేహానికి శ‌వ ప‌రీక్ష జ‌ర‌గ‌క‌ముందే... ఆమెపై అత్యాచారం జ‌ర‌గలేద‌ని గుంటూరు అర్బ‌న్ ఎస్పీ ఎలా చెబుతార‌ని లోకేశ్ ప్ర‌శ్నించారు. అలా చెప్పాల‌ని ఎస్పీపై ఒత్తిడి చేశారా? అని ప్ర‌శ్నించిన లోకేశ్...స‌జ్జ‌ల అనే జీత‌గాడు ఎస్పీని ఒత్తిడికి గురి చేశారా? అని ప్ర‌శ్నించారు. 

త‌మ‌ది పేటీఎం బ్యాచ్ కాద‌న్న లోకేశ్... త‌మ‌ది ఎల్లో బ్ల‌డ్ అని... ఏ ఒక్క‌రికీ భ‌యప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు. హ‌త్యాచారంపై చ‌ర్య‌లు తీసుకునేందుకు వైసీపీ ప్ర‌భుత్వానికి 21 రోజులు గడువు ఇస్తున్నాన‌ని చెప్పిన లోకేశ్... 21 రోజుల్లోగా నిందితుల‌కు ఉరిశిక్ష వేయ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు.

More Telugu News