Gujarat Titans: హైదరాబాద్ వరుస విజయాలకు అడ్డుకట్ట.. కొనసాగుతున్న గుజరాత్ జైత్రయాత్ర

  • 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న టైటాన్స్
  • హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుత స్పెల్
  • అర్ధ సెంచరీతో చెలరేగిన సాహా
  • చివర్లో జూలువిదిల్చిన రషీద్ ఖాన్
Rashid and Tewatia help GT overcome Malik fifer to clinch thriller

ఐపీఎల్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్నట్టు కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. ఆరో విజయంపై కన్నేసిన విలియమ్సన్ సేనను మట్టి కరిపించి 14 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

వాయువేగంతో బంతులు విసురుతూ గుజరాత్ బ్యాటర్లను బెంబేలెత్తించిన ఉమ్రాన్ మాలిక్ ఐదు వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌లో గెలుపు ఆశలు నింపాడు. అయితే, అతడి స్పెల్ పూర్తయ్యాక విజయం హైదరాబాద్ చేతుల నుంచి జారిపోయింది. భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సన్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్ వంటి బౌలర్లు గుజరాత్ బ్యాటర్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా హైదరాబాద్ పరాజయం పాలైంది. ముఖ్యంగా జాన్సన్ బౌలింగ్‌లో గుజరాత్ బ్యాటర్లు చెలరేగిపోయారు. నాలుగు ఓవర్లలో ఏకంగా 63 పరుగులు పిండుకున్నారు. 

తొలుత సాహా 38 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 68 పరుగులు చేస్తే, చివర్లో రాహుల్ తెవాటియా 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఇక, చివర్లో రషీద్ ఖాన్ బౌలర్లపై పగబట్టినట్టుగా ఆడాడు. 11 బంతుల్లో 4 సిక్సర్లతో ఏకంగా 31 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి టైటాన్స్ విజయాన్ని అందుకుంది. 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌కు ఇది ఏడో విజయం కావడం గమనార్హం. గుజరాత్ కోల్పోయిన 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్న జమ్మూకశ్మీర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (42 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్కరమ్ (40 బంతుల్లో 2 పోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరు బంతుల్లో ఫోర్, మూడు సిక్సర్లతో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ పరాజయంతో హైదరాబాద్ మూడో స్థానానికి పడిపోయింది. ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ కేపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

More Telugu News