Andhra Pradesh: మంత్రి రాకముందే సభ నుంచి చెక్కేస్తే సున్నావడ్డీ పథకం డబ్బులు ఆపేస్తాం: మహిళలకు మెప్మా ఆర్పీల బెదిరింపు

  • మార్కాపురంలో సున్నా వడ్డీ పథకం చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఆదిమూలపు సురేశ్ 
  • 10 గంటలకు రావాల్సిన మంత్రి మధ్యాహ్నం 2.15కు చేరుకున్న వైనం
  • చూసి చూసి విసిగిపోయి వెళ్లిపోయిన మహిళలు
  • వెళ్తే రుణాలు ఆపేస్తామన్నా పట్టించుకోని వైనం
MEPMA RPs Warns Women after they leave minister meeting in AP

ఏపీలోని పొదుపు మహిళలకు మెప్మా ఆర్పీలు తీవ్ర హెచ్చరికలు చేశారు. మంత్రి రాకముందే సభ నుంచి వెళ్లిపోతే వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం డబ్బులు నిలిపేస్తామని, సంఘాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిన్న పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సున్నా వడ్డీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన సభ కోసం మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల పరిధిలోని పొదుపు మహిళలకు కబురందించడంతో వారంతా సభకు హాజరయ్యారు. అయితే, ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం రెండు గంటలైనా మంత్రి జాడ లేకపోవడంతో విసిగిపోయిన మహిళల్లో కొందరు సభ నుంచి బయటకు వెళ్లిపోతుండగా గమనించిన మెప్మా ఆర్పీలు వారిని అడ్డుకున్నారు.

మంత్రి రాకముందే సభ నుంచి వెళ్లిపోతామంటే కుదరదని, కాదని వెళ్తే పథకం డబ్బులు ఆపేస్తామని, బ్యాంకు రుణాలు రాకుండా చేస్తామని బెదిరించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. వారి బెదిరింపులకు లొంగని మహిళలు మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటూ వెళ్లిపోయారు. అదే సమయంలో మంత్రి వస్తుండడంతో మెప్మా పీడీ రవికుమార్ వెళ్లిపోతున్న మహిళల వద్దకు వెళ్లి మంత్రి వస్తున్నారని, సభకు రావాలని కోరారు. అయినప్పటికీ మహిళలు వెనక్కి వచ్చేందుకు నిరాకరించారు. 2.15 గంటలకు మంత్రి రావడంతో కార్యక్రమం ప్రారంభమైంది.

More Telugu News