తన వయసులో సగం ఉన్న యువతితో రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ క్రికెటర్

  • మళ్లీ పెళ్లి చేసుకుంటున్న అరుణ్ లాల్ 
  • మిత్రురాలితో మే 2న పెళ్లి
  • గతంలో రీనాతో అరుణ్ లాల్ వివాహం
  • దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రీనా
  • రీనాతో విడాకులు తీసుకున్న అరుణ్ లాల్
  • అయినా కలిసే ఉంటున్న అరుణ్ లాల్, రీనా
Former cricketer set to tie the knot for the second time

అరుణ్ లాల్... ఇప్పటితరం వాళ్లకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 80వ దశకంలో భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించి, అప్పటితరంలో అనేకమందిని అభిమానులుగా మలుచుకున్న క్రికెటర్. ఓపెనర్ గా, మీడియం పేస్ బౌలర్ గా అరుణ్ లాల్ గుర్తింపు పొందారు. ఇప్పుడాయన వయసు 66 సంవత్సరాలు. అరుణ్ లాల్ గురించి ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే... ఈ వయసులో ఆయన రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. అది కూడా 38 ఏళ్ల మిత్రురాలితో. ఆమె పేరు బుల్ బుల్ సాహా. 

అరుణ్ లాల్ కు ఇదివరకే వివాహం జరిగింది. ఆయన మొదటి భార్య పేరు రీనా. కానీ ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దాంతో ఇద్దరూ పరస్పర అవగాహనతో విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు. అయితే, బుల్ బుల్ సాహాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు అరుణ్ లాల్... తన మొదటి భార్య రీనాకు చెప్పగా, ఆమె సంతోషంగా అంగీకరించింది. 

ఈ నేపథ్యంలో, మే 2న అరుణ్ లాల్ తన మిత్రురాలి చేయందుకోనున్నారు. వీరి పెళ్లి కోల్ కతాలో జరగనుంది. సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ అవుతోంది. తన మొదటి భార్య రీనా, కాబోయే భార్య బుల్ బుల్ సాహాలతో అరుణ్ లాల్ కలిసున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. అరుణ్ లాల్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.

More Telugu News