ట్విట్టర్ చీఫ్ పదవి నుంచి భారతీయుడ్ని మస్క్ తప్పిస్తారా..?
- అనిశ్చితిలో సీఈవో పరాగ్ అగర్వాల్ భవితవ్యం
- 2021 నవంబర్ లో సంస్థ పగ్గాలు చేపట్టిన అగర్వాల్
- తప్పిస్తే మస్క్ రూ.315 కోట్లు కట్టాల్సిందే
ఆరు నెలలకే ట్విట్టర్ యాజమాన్యం చేతులు మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి పరాగ్ అగర్వాల్ ను ఎలాన్ మస్క్ కొనసాగిస్తారా..? దీనిపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే ట్విట్టర్ యాజమాన్యం పట్ల తనలో నమ్మకం లేదంటూ ఈ నెల 14న మస్క్ యూఎస్ స్టాక్ ఎక్సేంజ్ లకు తెలిపారు. కనుక ట్విట్టర్ బోర్డులో మార్పులకు అవకాశం ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీనిపై కొన్ని రోజులు గడిస్తే కానీ స్పష్టత రాదు.
యాజమాన్యం నియంత్రణ మారిన ఏడాదిలోపు పరాగ్ అగర్వాల్ ను సీఈవోగా తప్పిస్తే అతడికి 42 మిలియన్ డాలర్లను (సుమారు రూ.315 కోట్లు) కంపెనీ చెల్లించాల్సి వస్తుందని పరిశోధన సంస్థ ఈక్విలర్ అంచనాగా ఉంది. మస్క్ ట్విట్టర్ కొనుగోలుకు జాక్ డోర్సే సైతం మద్దతు ప్రకటించడం తెలిసిందే.