Delhi High Court: ఢిల్లీ పోలీసులది ఘోర వైఫల్యమే: కేజ్రీవాల్ నివాసంపై దాడి ఘటనలో హైకోర్టు సీరియస్

  • ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై కేజ్రీవాల్ వ్యాఖ్యలకు నిరసన
  • సీఎం ఇంటి వద్ద బీజేపీ యువ మోర్చా విధ్వంసం
  • పోలీసుల వైఫల్యానికి బాధ్యులెవరో తేల్చాలంటూ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
  • వచ్చే నెల 17కు విచారణ వాయిదా
Delhi High Court angry with Police on CM kejriwal House Attack

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంపై దాడి విషయంలో పోలీసులది ఘోర వైఫల్యమేనని ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దాడిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, ఈ వైఫల్యానికి కారణమెవరో తేల్చాలని నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువమోర్చా గత నెల 30న సీఎం నివాసంపై దాడికి దిగింది. బారికేడ్లను తొలగించి విధ్వంసానికి పాల్పడింది.

ఈ ఘటనపై ‘ఆప్’ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘి నేతృత్వంలోని ధర్మాసనం నిన్న విచారించింది. దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ నివాసం వద్ద సరైన భద్రతా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులెవరో తేల్చి రెండువారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

More Telugu News