Navneet Kaur: తక్కువ కులం వాళ్లమని పోలీసులు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు: లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన ఎంపీ నవనీత్ కౌర్ రాణా

  • శివసేనతో ఎంపీ నవనీత్ రాణా దంపతుల అమీతుమీ
  • అరెస్ట్ చేసిన పోలీసులు
  • రిమాండ్ విధించిన కోర్టు
  • అరెస్ట్ అయిన రాత్రి ఏం జరిగిందో వివరించిన నవనీత్ 
  • చర్యలు తీసుకోవాలంటూ లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి
MP Navneet Rana wrote Lok Sabha Speaker Om Birla

మహారాష్ట్ర అధికార పక్షం శివసేనతో అమీతుమీకి సిద్ధమైన ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. కాగా, ఎంపీ నవనీత్ కౌర్ రాణా తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేన కొన్ని నిర్దిష్ట కారణాలతో హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఓటు ద్వారా తీర్పునిచ్చిన ప్రజలకు నమ్మకద్రోహం తలపెట్టిందని, ఎన్నికలు అయ్యాక కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు కుదుర్చుకోవడమే అందుకు నిదర్శనమని తెలిపారు. 

అయితే, శివసేనలో హిందుత్వ భావజాల జ్వాలను మళ్లీ రగిలించాలన్న ఉద్దేశంతోనే తాను సీఎం ఉద్ధవ్ థాకరే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తానని ప్రకటన చేశానని నవనీత్ కౌర్ రాణా స్పష్టం చేశారు. అంతేతప్ప, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలన్నది తన అభిమతం కాదని తెలిపారు. 

"సీఎం కూడా మాతో కలిసి హనుమాన్ చాలీసా పఠించాలని మేం కోరుకున్నాం. అందుకే ఆయనకు ఆహ్వానం పలికాం. ఇది సీఎం పట్ల వ్యతిరేకతతో తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. అయితే మా కార్యాచరణ ముంబయిలో శాంతిభద్రతలకు భంగం కలిగే రీతిలో ఉన్నాయన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని హనుమాన్ చాలీసా పఠనాన్ని విరమించుకున్నాం. ఈ మేరకు బహిరంగ ప్రకటన కూడా చేశాం. మేం సీఎం నివాసం వద్దకు వెళ్లడంలేదని స్పష్టం చేశాం. నేను, నా భర్త రవి రాణా ఇంటికే పరిమితం అయ్యాం. 

కానీ, 23వ తేదీన నన్ను, నా భర్తను ఖార్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తాగేందుకు నీళ్లు ఇవ్వాలని ఎన్ని పర్యాయాలు విజ్ఞప్తి చేసినా పోలీసులు ఒక్కసారి కూడా స్పందించలేదు. వారు రాత్రంతా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఇక, మంచినీళ్లు ఇవ్వకపోవడానికి అక్కడి పోలీసు సిబ్బంది చెప్పిన కారణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మేం షెడ్యూల్డ్ కులానికి చెందినందున అదే గ్లాసుతో నీళ్లు ఇవ్వబోమని చెప్పారు. నన్ను కులం పేరుతో నేరుగానే దూషించారు. కులం కారణంగానే మంచినీళ్లు ఇవ్వలేదన్న విషయం స్పష్టమైంది. నిమ్న జాతికి చెందిన వాళ్లమన్న కారణంతో నాకు తాగునీరు వంటి ప్రాథమిక హక్కు నిరాకరించారు. 

కనీసం నేను బాత్రూంను వినియోగించుకోవాలని భావించినప్పుడు కూడా పోలీసుల నుంచి తీవ్ర అభ్యంతరకర పదజాలం ఎదురైంది. పోలీసులు ఎంతో దారుణమైన రీతిలో నన్ను దుర్భాషలాడారు. నిమ్న కులాల వారు మా బాత్రూంలు వినియోగించుకోవడాన్ని మేం అంగీకరించబోమని పోలీసులు చెప్పారు" అంటూ నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ కు రాసిన లేఖలో వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు.

More Telugu News