హతవిధీ.. ఏమిటిది?.. ఎనిమిదో మ్యాచ్‌లోనూ ఓడిన ముంబై

25-04-2022 Mon 06:47
  • మరోమారు దారుణంగా విఫలమైన బ్యాటర్లు
  • 36 పరుగుల తేడాతో ఓటమి
  • ఈ సీజన్‌లో రెండో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్
  • ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా కృనాల్ పాండ్యా
KL Rahul and bowlers extend MIs hunt for first points
ముంబై తీరు మారలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో గత రాత్రి జరిగిన ఎనిమిదో మ్యాచ్‌లోనూ ఓడి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. తొలుత బౌలర్లు రాణించి లక్నోను 168 పరుగులకు కట్టడి చేసినా బ్యాటర్ల వైఫల్యం కారణంగా జట్టు 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

లక్నో నిర్దేశించిన 169 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలుపడిన ముంబై 20 ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేసి వరుసగా ఎనిమిదో పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 39, తిలక్ వర్మ 38, కీరన్ పొలార్డ్ 19 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ సింగిల్ డిజిట్‌ను కూడా దాటలేకపోయారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యాకు మూడు వికెట్లు దక్కాయి. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు సాధించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోమారు సెంచరీతో అదరగొట్టాడు. 62 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ స్కోరులో 12 ఫోర్లు, 4 భారీ సిక్సులున్నాయి. ఈ సీజన్‌లో రాహుల్‌కు ఇది రెండో సెంచరీ కాగా ఐపీఎల్‌లో నాలుగోది. టీ20ల్లో ఆరోది. రాహుల్ తర్వాత మనీష్ పాండే చేసిన 22 పరుగులే అత్యధికం. క్వింటన్ డికాక్ (10), మార్కస్ స్టొయినిస్ (0), కృనాల్ పాండ్యా (1), దీపక్ హుడా (10) దారుణంగా విఫలమయ్యారు. 

ముంబై బౌలర్లలో రిలే మెరిడిత్ 2, కీరన్ పొలార్డ్ 2, డేనియల్ శామ్స్ 1, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు. మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన లక్నో బౌలర్ కృనాల్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో లక్నో 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, ఖాతా తెరవని ముంబై అట్టడుగున ఉంది. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు మూసుకుపోయినట్టే.