ముంబయి ఇండియన్స్ ఇవాళైనా బోణీ కొట్టేనా...?

24-04-2022 Sun 19:39
  • నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబయి మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి 
  • ఇప్పటిదాకా 7 మ్యాచ్ లు ఆడిన ముంబయి
  • అన్నింటా ఓటమే!
Desperate Mumbai Indians wants first win in tourney
ఐపీఎల్ లో రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్ గా నిలిచిన ముంబయి ఇండియన్స్ తాజా సీజన్ లో ఇప్పటిదాకా ఒక్క విజయం సాధించలేకపోయిందంటే విమర్శకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆడిన 7 మ్యాచ్ ల్లోనూ ముంబయి ఇండియన్స్ కు ఓటమే ఎదురైంది. అసలు, లోపం ఎక్కడుందన్నది విశ్లేషించుకోవడంలోనూ ఆ జట్టు విఫలమవుతోందనడానికి వరుస ఓటములే నిదర్శనం. 

ఈ నేపథ్యంలో, ముంబయి ఇండియన్స్ నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబయి సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, ముంబయి జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అటు, లక్నో జట్టులో ఒక మార్పు జరిగింది. పేస్ బౌలర్ ఆవేశ్ ఖాన్ గాయంతో బాధపడుతుండగా, అతడి స్థానంలో మొహిసిన్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం వేదిక. 

కరోనా వ్యాప్తి కారణంగా ఈసారి ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్ లు ముంబయి, పూణేలోనే నిర్వహిస్తున్నారు. అది కూడా అత్యధిక మ్యాచ్ లు ముంబయిలోని వాంఖెడే, బ్రాబౌర్న్, డీవై పాటిల్ మైదానాల్లోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ ముంబయి ఇండియన్స్ ఇప్పటిదాకా గెలుపు బోణీ కొట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం.