Crime News: చెయ్యని నేరానికి 28 ఏళ్ల జైలు శిక్ష.. నిర్దోషి అని జడ్జి తీర్పివ్వగానే ఘొల్లున ఏడ్చిన వ్యక్తి

  • స్నేహితుడిని హత్య చేశాడంటూ కేసు
  • విలువైన జీవితం కోర్టులోనే వృథా
  • బెయిల్ కూ ప్రయత్నించని అతడి కుటుంబం
Man Acquitted Of Murder Charges After Spent 28 years in Jail

వంద మంది దోషులు తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదంటారు..! జస్టిస్ డిలెయ్డ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెబుతారు. ఓ వ్యక్తి విషయంలో ఇలాంటి తీవ్ర అన్యాయమే జరిగింది. చెయ్యని నేరానికి 28 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఓ హత్య కేసులో ఇన్నాళ్లూ జైలులో ఉండి జీవితాన్ని కోల్పోయిన ఆ వ్యక్తి.. జడ్జి తీర్పునివ్వగానే ఘొల్లుమని ఏడ్చేశాడు. ఈ ఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో జరిగింది. 

యూపీలోని దేవరియా జిల్లా తాండ్వా గ్రామానికి చెందిన బీర్బల్ భగత్ అనే వ్యక్తి.. బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లా హరిహరపూర్ కు చెందిన సూర్యనారాయణలు స్నేహితులు. 1993 జూన్ 11న సూర్యనారాయణను కలిసేందుకు బీర్బల్ వచ్చాడు. అదే రోజు ఇద్దరూ ముజఫర్ పూర్ కు వెళ్లారు. అప్పట్నుంచి సూర్యనారాయణ కనిపించకుండా పోయాడు. 

దీంతో అదే ఏడాది జూన్ 18న సూర్యనారాయణ కుమారుడు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రిని బీర్బల్ కిడ్నాప్ చేసి చంపేశాడంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, కొన్ని రోజుల తర్వాత ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎవరూ రాకపోవడంతో మూడు రోజుల తర్వాత ఖననం చేశారు. అయితే, పోలీసులు విడుదల చేసిన ఫొటోల ఆధారంగా అది సూర్యనారాయణ మృతదేహమేనని అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. 

ఆ తర్వాత కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. కొన్ని నెలలకు బీర్బల్ ను గోపాల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. అయితే, గురువారం మరోసారి గోపాల్ గంజ్ జిల్లా కోర్టులో జడ్జి విశ్వభూతి గుప్తా ముందుకు మరోసారి కేసు విచారణకు వచ్చింది. నిందితుడిపై పోలీసులు ఎలాంటి చార్జిషీటు నమోదు చేయలేకపోయారని, కేసుకు సరైన ఆధారాలూ లేవని, మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన వైద్యుడు, విచారణాధికారి ఒక్కసారి కూడా కోర్టులో హాజరు కాలేదని పేర్కొన్న జడ్జి.. కేసును కొట్టేశారు. బీర్బల్ ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశారు. 

వాస్తవానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే విచారణ మొదలైనా.. చాన్నాళ్ల పాటు అది మూత పడిందని, దీంతో ఇప్పుడు జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని డిఫెన్స్ లాయర్ రాఘవేంద్ర సిన్హా చెప్పారు. బీర్బల్ కు బెయిల్ ఇప్పించేందుకూ అతడి ఫ్యామిలీ ముందుకు రాలేదన్నారు. మరోవైపు బీర్బల్ జైలులో ఉన్న సమయంలోనే అతడి తల్లి, తండ్రి చనిపోయారు. 

‘‘ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. చెయ్యని నేరానికి 28 ఏళ్లు జైలు శిక్ష అనుభవించా. నేను నిర్దోషిగా విడుదలవుతానన్న ఆశనూ వదిలేసుకున్నా. ఇన్నేళ్లు చాలా కష్టంగా గడిచాయి’’ అని బీర్బల్ ఆవేదన వ్యక్తం చేశాడు.    

More Telugu News