Gujarat Titans: తడబడిన గుజరాత్.. అతి కష్టం మీద 156 పరుగులు చేసిన టైటాన్స్

  • బంతితో నిప్పులు చెరిగిన సౌథీ, రసెల్
  • క్రీజులోకి వచ్చినంత వేగంగా పెవిలియన్‌కు బ్యాటర్లు
  • నాలుగు వికెట్లు తీసి టైటాన్స్‌ను దెబ్బకొట్టిన రసెల్
Titans fall apart finish with 156

ఐపీఎల్‌లో తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మంచి జోరుమీదున్న గుజరాత్ టైటాన్స్ తడబడింది. కోల్‌కతాతో ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభం కలిసి రాలేదు. 8 పరుగుల వద్ద ఓపెనర్ శుభమన్ గిల్ (7) అవుటయ్యాడు. 

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఓపెనర్ వృద్ధిమాన్ సాహాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. సాహా 25 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిల్లర్ (27), రాహుల్ తెవాటియా (17) కూడా క్రీజులో కుదురుకోలేకపోయారు. కోల్‌కతా బౌలర్ల భయపెట్టే బంతులను ఎదుర్కోలేక వచ్చినంత వేగంగా పెవిలియన్‌కు వెళ్లిపోయారు.

రషీద్ ఖాన్ (0), అభినవ్ మనోహర్ (2), ఫెర్గ్యూసన్ (0), దయాళ్ (0) నాలుగు బంతులు కూడా ఎదుర్కోలేక వెనక్కి వెళ్లారు. అయితే, క్రీజులో పాతుకుపోయిన పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. మొత్తంగా 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేయడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. బంతితో నిప్పులు చెరిగిన టిమ్ సౌథీకి 3, ఆండ్రూ రసెల్‌కు 4 వికెట్లు దక్కాయి.

More Telugu News