Bomb Blast: మళ్లీ నెత్తురోడిన ఆఫ్ఘనిస్థాన్... బాంబుదాడిలో 33 మంది మృతి

  • కుందుజ్ ప్రావిన్స్ లోని మసీదులో పేలుళ్లు
  • చెల్లాచెదురుగా మృతదేహాలు
  • 43 మందికి గాయాలు
  • దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తాలిబన్ ప్రభుత్వ ప్రకటన
  • ఐసిస్ పనే అయ్యుంటుందని అనుమానాలు
Another bomb blast killed 33 people in Afghanistan

గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో హింస మళ్లీ ప్రజ్వరిల్లుతోంది. ఇటీవల పాఠశాలల్లో వరుస బాంబుపేలుళ్లతో ఉలిక్కిపడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు మరో భీకర బాంబు దాడి ఘటనతో భయకంపితులవుతున్నారు. తాజాగా కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలోని మవ్లావీ సికందర్ మసీదుపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించారు. 43 మంది గాయపడ్డారు. మృతి చెందినవారిలో పిల్లలు కూడా ఉన్నారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ ఘాతుకాన్ని తాము ఖండిస్తున్నామని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. 

గతేడాది తాలిబన్లు అధికారం చేపట్టాక జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. ఇది కూడా ఐసిస్ పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ లోని షియా, సూఫీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన చరిత్ర ఐసిస్ కు ఉంది. ఇప్పుడు దాడి జరిగిన మసీదు కూడా సూఫీ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతానికి చెందినది.

More Telugu News