Kakani Govardhan Reddy: వ్యవసాయ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ కాకాణి.. సంతకం చేసిన తొలి ఫైల్‌ ఏమిటంటే...!

kakani takes oath as minister
  • 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేష‌న్ అవకాశం ఇచ్చే ఫైల్ పై తొలి సంతకం 
  • దీని కోసం రూ.1,395 కోట్ల ఖ‌ర్చు 
  • అలాగే, 3,500 ట్రాక్టర్లని ఇచ్చే ఫైల్‌పై కాకాణి రెండో సంతకం
ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ వెంట‌నే 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేష‌న్ అవకాశం కల్పించే ఫైల్‌పై తొలి సంతకం చేశారు. దీని కోసం రూ.1,395 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. 

అలాగే, 3,500 ట్రాక్టర్లని వైఎస్సార్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైల్‌పై కాకాణి రెండో సంతకం చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... గన్నవరంలో రాష్ట్ర విత్త‌న ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల‌ (ఆర్బీకే) ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. 

అలాగే, రైతుల నగదు లావాదేవీలు కూడా ఆర్బీకేలలో జరిగేలా చర్యలు చేపట్టామ‌న్నారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని ఆయ‌న అన్నారు. మంత్రిగా త‌నకు అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు రూ.43 వేల కోట్లు కేటాయించిన‌ట్లు గుర్తు చేశారు. జగన్ రైతు పక్షపాతి అని, ఇప్ప‌టి వ‌ర‌కు రూ.20 వేల కోట్లకు పైగా రైతు భరోసా నగదును బదిలీ చేశామ‌ని మంత్రి చెప్పారు.
Kakani Govardhan Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News