Kieron Pollard: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ యోధుడు కీరన్ పొలార్డ్

Kieron Pollard announced retirement from International cricket
  • విండీస్ కు పరిమిత ఓవర్ల కెప్టెన్ గా ఉన్న పొలార్డ్
  • అన్ని ఫార్మాట్లలోనూ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు
  • ప్రైవేటు లీగ్ పోటీల్లో కొనసాగే అవకాశం
  • ఇప్పటివరకు టెస్టుల్లో ఆడని పొలార్డ్
వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని విధాలుగా ఆలోచించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు పొలార్డ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. పొలార్డ్ ప్రస్తుతం వెస్టిండీస్ కు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల అతడి కెప్టెన్సీలో విండీస్ ఏమంత ఆశాజనక ఫలితాలు పొందలేకపోయింది. 

ఎంతోమంది యువక్రికెటర్ల మాదిరే తాను కూడా వెస్టిండీస్ జట్టుకు ఆడాలని కలలు కన్నానని, 10 ఏళ్ల వయసు నుంచే తాను కరీబియన్ జట్టుకు ఆడడం కోసం తహతహలాడానని వివరించాడు. 15 ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు వన్డేలు, టీ20 ఫార్మాట్లలో సేవలు అందించడం పట్ల గర్విస్తున్నానని పొలార్డ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన తన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. 

34 ఏళ్ల పొలార్డ్ 2007లో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 123 అంతర్జాతీయ వన్డేలు ఆడి 26.01 సగటుతో 2,706 పరుగులు చేశాడు. వాటిలో 3 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 101 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి 25.30 సగటుతో 1,569 పరుగులు సాధించాడు. వాటిలో 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. 

ఇక బౌలింగ్ విషయానికొస్తే.. అంతర్జాతీయ వన్డేల్లో 55, అంతర్జాతీయ టీ20ల్లో 42 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో, పొలార్డ్ ను అభిమానులు ఇక ఐపీఎల్, బిగ్ బాష్, పీఎస్ఎల్, సీపీఎల్, బంగ్లా లీగ్ క్రికెట్ పోటీల్లోనే చూస్తారు.
Kieron Pollard
Retirement
International Cricket
West Indies

More Telugu News