Thief: వృద్ధురాలిని చితకబాది కారు చోరీ చేశాడు... పారిపోయే క్రమంలో...!

Thief died in road crash after he stolen car from old woman
  • అమెరికాలో ఘటన
  • కారులో పెట్రోల్ బంక్ కు వెళుతున్న వృద్ధురాలు
  • వృద్ధురాలిని అటకాయించిన దొంగ
  • కారుతో పరారీ.. రోడ్డు ప్రమాదంలో మృతి
అమెరికాలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఓ వృద్ధురాలిని బెదిరించి కారు చోరీ చేసిన దొంగ పారిపోయే క్రమంలో మృతి చెందాడు. శాన్ ఆంటోనియోలో షిర్లీన్ హెర్నాండెజ్ (72) అనే వృద్ధురాలు కారులో పెట్రోల్ బంక్ వద్దకు వెళుతోంది. అయితే ఓ దొంగ ఆమెను అటకాయించాడు. 

కారు తాళాలు ఇవ్వాలంటూ ఆమెపై దాడి చేశాడు. అతడిని ముగ్గురు అడ్డుకునే ప్రయత్నించినా, ఆ వృద్ధురాలి నుంచి తాళాలు లాక్కుని కారుతో సహా ఉడాయించాడు. అయితే, అతడు చోరీ చేసిన కారుతో హైవే ఎక్కాడో లేదో మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ ప్రమాదంలో సదరు దొంగ అక్కడికక్కడే మరణించాడు. 

ఈ విషయం తెలిసిన వృద్ధురాలు షిర్లీన్ హెర్నాండెజ్ స్పందిస్తూ, కారు దొంగిలించడం తప్పే అయినా, అతడు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని పేర్కొంది. దేవుడు అతడిలో దుర్గుణాన్ని తొలగించలేకపోయాడని విచారం వ్యక్తం చేసింది. కాగా, దొంగ దాడిలో గాయపడిన వృద్ధురాలు మరో కారు కొనుక్కునేందుకు ప్రజలు ఆన్ లైన్ లో విరాళాల సేకరణ ప్రారంభించారు. ఇప్పటివరకు 28 వేల డాలర్లు విరాళాల రూపంలో వచ్చాయట.
Thief
Car
Death
Road Accident
Old Woman
San Antonio
USA

More Telugu News