తెలంగాణ‌లో రైస్ మిల్లుల్లో త‌నిఖీలకు కేంద్రం ఆదేశం

  • 40 రైస్ మిల్లుల్లో 4.53 ల‌క్ష‌ల బ‌స్తాలు మాయమయ్యాయన్న కిషన్ రెడ్డి 
  • ధాన్యం మాయ‌మైన వ్య‌వ‌హారంపై రాష్ట్రం ఏం చ‌ర్య‌లు తీసుకుందని ప్రశ్నించిన మంత్రి 
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైస్ మిల్లుల‌పై త‌నిఖీలు చేయమని ఎఫ్‌సీఐ అధికారుల‌కు  ఆదేశాలు  
kishan reddy orders fci to inspect all rice mills in telangana

తెలంగాణ‌లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం మ‌ధ్య మరో వివాదం రాజుకుంది. యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్ర‌మే కొనుగోలు చేయాలంటూ కేసీఆర్ స‌ర్కారు డిమాండ్ చేయ‌డంతో పాటుగా ఆ డిమాండ్‌ను సాధించుకునేందుకు ఏకంగా నిర‌స‌న‌ల‌తో హోరెత్తించింది. అయినా కూడా కేంద్రం దిగిరాని నేప‌థ్యంలో ధాన్యం మొత్తాన్ని తామే కొంటామంటూ కేసీఆర్ స‌ర్కారు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కొనుగోళ్లు కూడా ప్రారంభ‌మైపోయాయి. రైస్ మిల్ల‌ర్ల ద్వారా నేరుగా రైతుల నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది.

ఇలాంటి త‌రుణంలో తెలంగాణ నుంచి ఎంత మేర బియ్యం వ‌చ్చినా కొనుగోలు చేయాల‌ని ఇటీవ‌లే కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి భార‌త ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా బుధ‌వారం నాడు మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చిన కిష‌న్ రెడ్డి తెలంగాణ‌లోని అన్ని రైస్ మిల్లుల‌ను త‌నిఖీ చేయాల‌ని ఎఫ్‌సీఐ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంద‌ర్బంగా కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌లే ఎఫ్‌సీఐ అధికారులు త‌మ రొటీన్ త‌నిఖీల్లో భాగంగా 40 రైస్ మిల్లుల‌ను త‌నిఖీ చేస్తే 4.53 ల‌క్ష‌ల బ‌స్తాల మేర ధాన్యం మిస్సైన‌ట్లు తేలింద‌ని ఆయ‌న తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఏమైంద‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న‌... రాష్ట్రంలోని అన్ని రైస్ మిల్లుల‌ను త‌నిఖీ చేయాలంటూ ఎఫ్‌సీఐ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలిపారు. 

ఇలా ధాన్యం మాయ‌మైన వ్య‌వ‌హారంలో రైస్ మిల్ల‌ర్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుందో తేల్చాల‌ని కూడా ఎఫ్‌సీఐ అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

More Telugu News