మాజీ ఐఏఎస్ లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేశ్ లపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్

20-04-2022 Wed 09:24
  • వీరిద్దరూ పేదలను ఆగర్భ శత్రువులుగా చూస్తున్నారన్న డిప్యూటీ సీఎం  
  • చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనేదే వీరి తపనంటూ కామెంట్  
  • చంద్రబాబు అప్పులు చేసినప్పుడు వీరిద్దరూ ఏం చేశారని ప్రశ్నించిన నారాయణ స్వామి  
AP Deputy CM LV Subrahmanyam and PV Ramesh
మాజీ ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేశ్ లపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరూ పేదలను ఆగర్భ శత్రువులుగా చూస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఐఏఎస్ అధికారి శంకరన్ పేదల కోసం ఏం చేశారో గమనించాలని చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకోరా? అని ప్రవ్నించారు. చంద్రబాబును ఎలాగైనా మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనే తపన వీరిద్దరి మాటల్లో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 

వైసీపీ ప్రభుత్వం పేదలకు ఎంతో చేస్తోందని... దీన్ని ఎల్వీ, పీవీ ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారులను చంద్రబాబు ముందుంచి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అప్పులు చేస్తుంటే వీరిద్దరూ ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఏం అభివృద్ధి జరిగింది? ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని అడిగారు.

తాను సీఎం జగన్ కాళ్లకు మొక్కితే ఓర్చుకోలేకపోతున్నారని నారాయణస్వామి అన్నారు. పేదలకు జగన్ చేస్తున్న మంచి పనులను చూసే... వయసును కూడా పట్టించుకోకుండా కాళ్లు మొక్కానని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇవ్వకున్నా కాళ్లకు మొక్కేవాడినని అన్నారు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదని అన్నారు.