Congress: హనుమకొండలో రాహుల్‌గాంధీ సభ.. 5 లక్షల మందిని సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్!

Congress Leader Rahul Gandhi Coming to Hanamakonda on May 6th
  • మే 6న హనుమకొండలో కాంగ్రెస్ ‘రైతు సంఘర్షణ’ సభ
  • చాలాకాలం తర్వాత రాష్ట్రానికి రాహుల్
  • ఈ సభ ద్వారా పార్టీవైపు ప్రజలను ఆకర్షించాలని యోచన
  • జన సమీకరణ కోసం జిల్లాల్లో పర్యటిస్తున్న నేతలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెల 6న హనుమకొండ రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ భారీ సన్నాహాలు చేస్తోంది. చాలాకాలం తర్వాత రాహుల్ రాష్ట్రానికి వస్తుండడంతో దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తలపోస్తోంది. రాహుల్ పాల్గొనే ‘రైతు సంఘర్షణ’ సభకు ఏకంగా 5 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సభ ద్వారా ప్రజలను కాంగ్రెస్‌ వైపు ఆకర్షించడంతోపాటు వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని భావిస్తోంది. 

రాహుల్ సభకు జనసమీకరణ కోసం పలువురు నేతలు ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తున్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి నిన్న సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అలాగే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. ఎల్లుండి రేవంత్, కోమటిరెడ్డి  వెంకట్‌రెడ్డి, మధుయాస్కీ, ఇతర ముఖ్యనాయకులు హనుమకొండలోని సభావేదికను పరిశీలించి జిల్లా నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. 23న హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించనున్న విస్తృతస్థాయి సమావేశంలో హనుమకొండ సభపై చర్చిస్తారు.
Congress
Hanamkonda
Rahul Gandhi
TPCC President
Revanth Reddy

More Telugu News