Pawan Kalyan: త్వరలో తెలంగాణలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan tour in Telangana
  • తెలంగాణలో ఇద్దరు జనసైనికుల మృతి
  • వారిద్దరి కుటుంబాలను పరామర్శించనున్న పవన్
  • బీమా చెక్కుల అందజేత
  • తెలంగాణలోనూ తమకు బలమైన క్యాడర్ ఉందన్న నాదెండ్ల

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇటీవల మరణించిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం అందజేస్తారని తెలిపారు. చౌటుప్పల్, హుజూర్ నగర్ ప్రాంతాలకు చెందిన సైదులు, కడియం శ్రీనివాస్ జనసేన పార్టీ కోసం ఎంతో శ్రమించారని, పార్టీ సిద్ధాంతాలు-భావజాలంపై నమ్మకంతో తమతో ఇన్నాళ్లు ప్రయాణించారని నాదెండ్ల వివరించారు. 

అయితే, వారిద్దరూ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారని, ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని అన్నారు. వారం, పది రోజుల్లో పవన్ కల్యాణ్ స్వయంగా ఆ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. వారికి ప్రమాద బీమా చెక్కులు అందజేస్తారని వివరించారు. 

కాగా, జనసేన పార్టీకి తెలంగాణలో బలం లేదని, ఉభయ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోనూ పవన్ కు పట్టులేదని పలువురు విమర్శిస్తున్నారని నాదెండ్ల అన్నారు. కానీ జనసేనకు సరిహద్దుల్లోనే కాకుండా, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అనేక ప్రాంతాల్లో బలమైన క్యాడర్ ఉందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మార్పు కోసం పవన్ తపన చూసి ఎంతోమంది యువత ఆకర్షితులవుతున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News