Raghu Rama Krishna Raju: ఎస్పీ గారు కుక్క స్టోరీ భలే చెప్పారు: రఘురామ కృష్ణరాజు

Raghurama reacts to SP explanation to Nellore Court theft case
  • నెల్లూరు కోర్టులో చోరీపై ఎస్పీ విజయరావు వివరణ
  • అది పాత సామాన్ల దొంగల పనే అని వెల్లడి
  • కాకాణికి దైవలీలలు కలిసొచ్చాయంటూ రఘురామ సెటైర్  
నెల్లూరు కోర్టులో చోరీ వెనుక ఏం జరిగిందనేది నిన్న ఎస్పీ విజయరావు మీడియాకు వెల్లడించారు. కుక్కకు భయపడిన దొంగలు కోర్టు రూమ్ తాళం పగలగొట్టారని, లోపలికి వెళ్లి బీరువా పగలగొట్టి అందులోని ఓ బ్యాగ్ ఎత్తుకెళ్లారని వివరించారు. తాజాగా, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దీనిపై స్పందించారు. 

ఎస్పీ గారు కుక్క స్టోరీ భలే చెప్పారని సెటైర్ వేశారు. ఒకవేళ ఎస్పీ గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు కూడా ఉండే అవకాశం ఉందని అన్నారు. యాదృచ్ఛికంగా ఎన్నో జరుగుతుంటాయని పేర్కొన్నారు. 

"పొట్టకూటి కోసం పాత ఇనుప సామాన్లు దొంగతనం చేసే నేరస్తులు కోర్టు వద్ద ఉన్న సామాను గమనించారట. దొంగతనానికి వచ్చి కుక్క అరవడంతో భయపడి దాక్కునేందుకు కోర్టు రూమ్ తాళం బద్దలు కొట్టారట. మరి వారు తాళం పగులగొడుతున్నప్పుడు ఆ కుక్క ఎక్కడికి వెళ్లిందో! అసలా కుక్క ఉందో లేదో భగవంతుడికే తెలియాలి. ఎస్పీ గారు కుక్క స్టోరీ చాలా బాగా చెప్పారు. వినడానికి మాత్రం చాలా బాగుంది.

ఇక, వారు కోర్టు రూమ్ లోకి వెళ్లిన తర్వాత కూడా కుక్క వస్తుందేమోనని ఆందోళన చెంది బీరువాలో దాక్కోవాలని అనుకున్నారేమో... ఆ బీరువాని కూడా బద్దలు కొట్టారట. కుక్క నుంచి రక్షణ కోసం బీరువాని బద్దలు కొట్టారా? లేక ఇనుప సామాన్లు బీరువాలో దాచారేమోనని బద్దలు కొట్టారా? ఏమో కొందరు దొంగలు బంగారం ఉన్నా ముట్టుకోకుండా ఇనుమే దొంగతనం చేస్తారు. ఎస్పీ గారు కూడా ఆ దొంగలు ఇనుప సామాన్ల చోరీ స్పెషలిస్టులనే చెప్పారు. ఏమైనా మంత్రి కాకాణి గారికి దైవలీల కలిసొచ్చినట్టుంది. ఆయనపై ఉన్న కేసు పత్రాలే చోరీకి గురికావడం దైవలీలల పరంపర కొనసాగినట్టుగా అనిపిస్తోంది" అంటూ రఘురామ వ్యంగ్యం ప్రదర్శించారు.
Raghu Rama Krishna Raju
Nellore Court
Theft
SP Vijayarao

More Telugu News