తమిళనాడు టేబుల్ టెన్నిస్ యువ క్రీడాకారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

  • నేటి నుంచి షిల్లాంగ్ లో జాతీయ టీటీ పోటీలు
  • గౌహతి నుంచి కారులో బయల్దేరిన తమిళనాడు టీమ్
  • షంగ్ బంగ్లా వద్ద రోడ్డు ప్రమాదం
  • ఎదురుగా వచ్చి ఢీకొట్టిన భారీ వాహనం
Tamilnad TT player Vishwa Deenadayalan dies in road mishap

భారత క్రీడావర్గాల్లో విషాదం నెలకొంది. తమిళనాడుకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. విశ్వ వయసు 18 ఏళ్లు. నేషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు గువాహటి నుంచి షిల్లాంగ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఇతర క్రీడాకారులు రమేశ్ సంతోష్ కుమార్, అభినాష్ ప్రసన్నజీ శ్రీనివాసన్, కిశోర్ కుమార్ లతో కలిసి విశ్వ దీనదయాళన్ ఓ ట్యాక్సీలో షిల్లాంగ్ బయల్దేరారు. షంగ్ బంగ్లా ప్రాంతంలో రోడ్డుపై ఎదురుగా వచ్చిన ఓ భారీ వాహనం డివైడర్ ను ఢీకొట్టి, ఆపై ట్యాక్సీని ఢీకొట్టింది. ఆపై పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది. 

ఈ ఘటనలో క్రీడాకారులు ప్రయాణిస్తున్న ట్యాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, కొన ఊపిరితో ఉన్న విశ్వ దీనదయాళన్ ను నార్త్ ఈస్ట్రన్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరో ముగ్గురు క్రీడాకారులను టోర్నీ నిర్వాహకులు మేఘాలయ ప్రభుత్వం సాయంతో ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స జరుగుతోంది. 

విశ్వ దీనదయాళన్ ఎంతో ప్రతిభ ఉన్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. చెన్నైలోని అన్నానగర్ లో ఉన్న కృష్ణస్వామి టీటీ క్లబ్ లో ఆటలో శిక్షణ పొంది రాటుదేలాడు. ఏప్రిల్ 27 నుంచి ఆస్ట్రియాలోని లింజ్ లో జరగనున్న డబ్ల్యూటీటీ యూత్ కంటెండర్ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు విశ్వ ఎంపికయ్యాడు. అండర్-19 స్థాయిలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అనేక పతకాలు సాధించాడు.

More Telugu News