Niveda Pethuraj: 'ఓటీటీ రివ్యూ 'బ్లడీ మేరీ'

Bloody Mary Movie Review
  • 'ఆహా'లో 'బ్లడీ మేరీ'
  • ప్రధానమైన పాత్రలో నివేదా పేతురాజ్ 
  • కీలకమైన పాత్రలో అజయ్ 
  • దర్శకుడిగా చందూ మొండేటి

ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఓటీటీ కోసమే అనుకుని తీసిన సినిమాలను చకచకా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ తరహా సినిమాల్లో థ్రిల్లర్ నేపథ్యంలోని కథలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అదే తరహాలో ఈ వారం 'బ్లడీ మేరీ' అనే సినిమాను స్ట్రీమింగ్ చేశారు. నివేదా పేతురాజ్ .. బ్రహ్మాజీ .. అజయ్ .. కిరీటీ ..  రాజ్ కుమార్ ప్రధానమైన పాత్రలను పోషించారు. 'కార్తికేయ' దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. 

ఈ సినిమాలో మేరీ (నివేదా) బాషా (కిరీటీ) రాజు (రాజ్ కుమార్)  ముగ్గురూ కూడా ఒక అనాథ శరణాలయంలో పెరుగుతారు. మేరీ ఒక హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తూ, బాషా .. రాజు ఇద్దరూ  తాము అనుకున్న మార్గంలో ముందుకు వెళ్లేలా సహకరిస్తూ ఉంటుంది. మేరీకి చూపు సరిగ్గా ఉండదు. అందువలన ఆమె కాంటాక్ట్ లెన్స్ వాడుతూ ఉంటుంది. ఇక బాషా మూగవాడు కాగా .. రాజుకి వినికిడి శక్తి ఉండదు. శరణాలయంలో తమ చిన్నప్పుడు జరిగిన ఒక మర్డర్ .. పిల్లల కిడ్నాప్ తరచూ మేరీకి గుర్తుకు వస్తుంటాయి. 

మేరీ అందచందాలపై మనసు పారేసుకున్న డాక్టర్ కాంతారావు ఆమెను బలవంతం చేయబోతాడు. తనని తాను రక్షించుకోవడానికి మేరీ చేసే ప్రయత్నంలో అతను చనిపోతాడు. ఇక ఇదే సమయంలో సీఐ ప్రభాకర్ (అజయ్) భార్య ఒక వ్యక్తిని హత్యచేయడాన్ని బాషా చూస్తాడు. అందుకు సంబంధించిన వీడియో రాజు చేతికి చిక్కుతుంది. డాక్టర్ కాంతారావు హత్యకేసు విషయంలో మేరీ ఇంటికి సీఐ ప్రభాకర్ వస్తాడు. తన భార్య చేసిన హత్య తాలూకు వీడియో వాళ్ల దగ్గర ఉందనే విషయం ప్రభాకర్ కి తెలియదు. ఆ వీడియో సాక్ష్యాన్ని అడ్డుపెట్టుకుని తానున్న పరిస్థితి నుంచి బయటపడాలని మేరీ నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఆమె ఏం చేసింది? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేదే కథ. 

కథను ఎత్తుకున్న తీరు .. ఒక స్థాయివరకూ కథనాన్ని నడిపించిన తీరు బాగుంది. ఒక్కో ఆపదను .. అవాంతరాన్ని మేరీ దాటుకుంటూ వెళ్లిన విధానాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఒకానొక సమయంలో మేరీ పథకం బెడిసికొట్టి ఆమె పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. తనతో పాటు తన స్నేహితులను కూడా ప్రమాదంలో పడేస్తుంది. అప్పటివరకూ స్క్రీన్ ప్లేలో ఉన్న పట్టు .. ఇక్కడి నుంచి సడలినట్టుగా అనిపిస్తుంది. కథ కూడా వాస్తవానికి కాస్త దూరంగా జరుగుతుంది. ముగింపు కూడా అంత సంతృప్తికరంగా అనిపించదు. 

చాలా సింపుల్ లైన్  తీసుకుని, తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో చందూ మొండేటి మంచి అవుట్ పుట్ ఇచ్చాడనే చెప్పాలి. స్క్రీన్ ప్లే పై మంచి పట్టున్న దర్శకుడిగా ఆయనకి పేరుంది. కాకపోతే ఈ సినిమా విషయంలో ఒక స్థాయికి వెళ్లిన తరువాత స్క్రీన్ ప్లే లోని పట్టు జారిపోయింది. కథ క్లైమాక్స్ కి చేరుకుంటున్నా కొద్దీ సహజత్వాన్ని దాటుకుని, అతిశయోక్తి వైపు వెళుతుంది. ముఖ్యమైన పాత్రలను మలిచిన తీరు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఆర్టిస్టులంతా పాత్ర పరిథిలో  మెప్పించారు. చందూ మొండేటి ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే, ఈ సినిమా మరో మెట్టు పైన కనిపించేదనడంలో సందేహం లేదు.
--- పెద్దింటి గోపీకృష్ణ

  • Loading...

More Telugu News