America: భారతీయులపై అమెరికన్ మహిళా ప్రొఫెసర్ విద్వేష వ్యాఖ్యలు.. భయంతోనే అక్కసన్న రాజా కృష్ణమూర్తి

Indian Americans slam University of Pennsylvania professor
  • పాశ్చాత్యులు సాధించిన అపూర్వ విజయాలను చూసి నల్లజాతి వారికి అసూయన్న ప్రొఫెసర్
  • భారత్ ఓ చెత్త కుప్ప అని అభివర్ణణ
  • పాశ్చాత్యులు అన్ని విషయాల్లోనూ ముందుండడంతో తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్య
  • ఆ దరిద్రం ట్రంప్‌తోనే పోయిందనుకుంటే ఇప్పుడు ఎమీ తయారయ్యారన్న రాజా కృష్ణమూర్తి
భారతీయ అమెరికన్లపై పెన్సిల్వేనియా యూనివర్సిటీ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ ఎమీ వ్యాక్స్ చేసిన విద్వేష వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ఫాక్స్’ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. భారతీయ అమెరికన్లపై తనకున్న అక్కసును వెళ్లగక్కారు. పాశ్చాత్యులు (శ్వేతజాతీయులు) సాధించిన అపూర్వ విజయాలను చూసి నల్లజాతివారు, పాశ్చాత్యేతరులు అసూయ చెందుతున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, పాశ్చాత్యులు సాధించిన విజయాలను తాము ఎన్నటికీ అందుకోలేమని అసూయ పడుతున్నారని అన్నారు.  

అంతేకాదు, భారతీయులు తాము బ్రాహ్మణ మేధావులం కాబట్టి అందరికంటే తామే ఉన్నతులమని నూరిపోస్తున్నారని, కానీ వారి దేశం (భారతదేశం) ఒక చెత్త కుప్ప అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆసియన్ అమెరికన్ల కంటే పాశ్చాత్యులు అన్ని విషయాల్లోనూ ముందుండడం వారిలో ఆగ్రహానికి, ఆత్మన్యూనతకు, అసూయకు కారణమవుతోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ప్రొఫెసర్ ఎమీ వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర దేశాలను చెత్త కుప్పలుగా వర్ణించే దురలవాటు డొనాల్డ్ ట్రంప్‌తోనే పోయిందనుకుంటే ఇప్పుడు ప్రొఫెసర్ ఎమీ తయారయ్యారని అమెరికా పార్లమెంటు సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. శ్వేతజాతీయేతర వర్గాలను ఇంతగా అవమానించిన ఆమెను చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. ఎమీ వ్యాఖ్యలు భయం నుంచి, విద్వేషం నుంచి పుట్టాయని, మైనారిటీలకు అవి హాని చేస్తాయని అన్నారు. భారత సంతితికి చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ నీల్ మఖీజా కూడా ఎమీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాగా, విద్వేష వ్యాఖ్యలు చేసిన ఎమీ వ్యాక్స్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు పెన్సిల్వేనియా యూనివర్సిటీ తెలిపింది.
America
Indian-Americans
Raja Krishnamoorthi
Prof Amy Wax

More Telugu News