మరో ప్రధాన ఎన్నికల హామీని నిలబెట్టుకున్న పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం!

  • ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటన
  • జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పథకం
  • ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ప్రకటన
Punjab AAP government Announces 300 Units Free Power To Every Home

పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలతో సామాన్యులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని భగవంత్ మాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. భగవంత్ మాన్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. 

పంజాబ్ ప్రజలకు ఒక తీపి కబురు అందిస్తామంటూ ఈ నెల 12న సీఎం భగవంత్ ట్వీట్ చేశారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిసిన అనంతరం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... తమ అధినేత కేజ్రీవాల్ తో అద్భుతమైన సమావేశం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ చెపుతామని తెలిపారు. ఆయన చెప్పిన విధంగానే 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ప్రభుత్వ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో... ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామనే హామీని ఆప్ ఇచ్చింది. ఆప్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటి. మరోవైపు ఢిల్లీలో కూడా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ఆప్ ప్రభుత్వం ఇస్తోంది.

More Telugu News