ఆశ్రయం ఇచ్చిన పాపానికి మహిళ భర్తనే పెళ్లాడతానంటున్న యువతి.. షాక్‌తో పోలీసులను ఆశ్రయించిన దంపతులు

  • జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఆన్‌లైన్ స్నేహాలు
  • భర్తను ఒప్పించి ‘ఆన్‌లైన్ ఫ్రెండ్’కు ఇంట్లో ఆశ్రయం
  • రెండు నెలల తర్వాత ఆమె భర్తనే పెళ్లాడేందుకు ముందుకొచ్చిన యువతి
  • యువతి తల్లిదండ్రులు కూడా ఆమెకే వత్తాసు
  • మీరే తేల్చుకోవాలంటున్న పోలీసులు
Online friend want to marry friends husband shocked couple went to police station

ఆన్‌లైన్ స్నేహాలు జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తాయో చెప్పే మరో ఉదాహరణ ఇది. చదువుకుంటానంటే దయతలచి పోనీలే అని ఆశ్రయం ఇస్తే ఆ ఇంటికే ఎసరు పెట్టే ప్రయత్నం చేసిందో యువతి. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. నగరానికి చెందిన ఓ వివాహిత సివిల్స్‌కు సన్నద్ధమవుతోంది. ఆమె భర్త లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఆమెకు తనలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతితో ఆన్‌లైన్‌లో పరిచయమైంది. అది క్రమంగా స్నేహంగా మారింది. పరీక్షలకు సంబంధించి ప్రతిరోజూ మాట్లాడుకునేవారు. 

ఈ క్రమంలో ఉద్యోగం కోసం శ్రమిస్తున్న ఆ యువతి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, అందుకనే నగరానికి వచ్చి శిక్షణ తీసుకోలేకపోతోందని తెలుసుకుంది. తన ఇంటికి వచ్చి తనతో పాటు ఉండి చదువుకోమని చెప్పింది. ఇందుకు వివాహిత తన భర్తను కూడా ఒప్పించింది. అతడు కూడా సరేననడంతో ఓ రోజు యువతి వారింట్లో వాలిపోయింది. రెండు నెలలపాటు బాగానే ప్రిపేరైంది. ఈ క్రమంలో దంపతులకు పిల్లలు లేరని తెలుసుకుంది. 

ఇటీవల వారిద్దరినీ కూర్చోబెట్టి లెక్చరర్ అయిన ఆమె భర్తను వివాహం చేసుకుంటానని చెప్పింది. రెండో భార్యగా ఉండేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అది విన్న ఆ దంపతులు పెద్ద షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకున్న వారు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటావని పోనీలే అని ఆశ్రయం ఇస్తే నా కొంపకే ఎసరు పెట్టాలని చూస్తావా? అని వివాహిత మండిపడింది. అయినా యువతి పట్టువీడలేదు. 

దీంతో ఇక లాభం లేదని యువతి తల్లిదండ్రులను పిలిపించి విషయం చెబితే వారు కూడా కుమార్తెనే వెనకేసుకొచ్చారు. ఎలాగూ పిల్లలు లేరు కాబట్టి తమ అమ్మాయి రెండో భార్యగా ఉంటుందని చెప్పడంతో వీరికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి సైబరాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. ఇది భార్యాభర్తల మధ్య గొడవ కాదని, కాబట్టి దీనిని మీరే పరిష్కరించుకోవాలని చెప్పి పంపించేశారు.

More Telugu News