Bangladesh: చాక్లెట్ కోసం నది ఈది, సరిహద్దు దాటి.. భారత్‌లోకి బంగ్లాదేశ్ బాలుడు!

Bangladesh teen nabbed while sneaking into India to buy chocolate
  • భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో షాల్డా నది 
  • చాక్లెట్లు తినాలని అనిపించినప్పుడల్లా నది దాటి భారత్‌లోకి
  • ఈసారి బీఎస్ఎఫ్ సిబ్బందికి దొరికిపోయిన బాలుడు
  • అతడు చెప్పింది విని నోరెళ్లబెట్టిన పోలీసులు
  • 15 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
చాక్లెట్ కోసం బంగ్లాదేశ్ బాలుడు పెద్ద సాహసమే చేశాడు. నదిని ఈది సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. అయితే, కోరిక నెరవేరకుండానే జైలుకెళ్లి ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని షాల్డా నది సమీప గ్రామానికి చెందిన బాలుడు ఇమాన్ హొసైన్‌కు భారత్‌లో దొరికే చాక్లెట్లు అంటే చెప్పలేనంత ఇష్టం. 

ఇక వాటిని తినాలని కోరిక కలిగినప్పుడల్లా ఈదుకుంటూ నది దాటి త్రిపుర సిపాహీజలా జిల్లాలోని కలామ్‌చౌరా గ్రామానికి వచ్చి చాక్లెట్లు కొనుక్కుని వచ్చిన దారినే వెళ్తుండేవాడు. ఈ నెల 13న మరోసారి చాక్లెట్ల కోసం వచ్చి బీఎస్ఎఫ్ సిబ్బందికి దొరికిపోయాడు. వారు బాలుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. బాలుడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా 15 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది.

విచారణ సందర్భంగా బాలుడు చెప్పింది విని పోలీసులు ఆశ్చర్యపోయారు. భారత్‌లో దొరికే చాక్లెట్లు అంటే తనకెంతో ఇష్టమని, వాటిని కొనుక్కునేందుకు వస్తుంటానని చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు. అతడి వద్ద 100 బంగ్లాదేశీ టాకాలను గుర్తించారు. అతడి వద్ద అక్రమంగా మరేవీ లేవని తెలిపారు. బాలుడి వద్ద చెల్లుబాటు అయ్యే పత్రాలు ఏవీ లేకపోవడంతోనే అరెస్ట్ చేసినట్టు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరోమారు అతడిని కోర్టులో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. కాగా, బాలుడి గురించి ఇప్పటి వరకు అతడి కుటుంబ సభ్యులు ఎవరూ భారత అధికారులను సంప్రదించలేదు.
Bangladesh
Boy
Chocolates
India
BSF

More Telugu News