Jitan Ram Manjhi: రామాయణంలో రాముడు ఓ పాత్ర మాత్రమే... దేవుడు కాదు: బీహార్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

  • అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న  మాంఝీ
  • రామాయణాన్ని వాల్మీకి, తులసీదాస్ రాశారని వెల్లడి
  • తమ సందేశం కోసం రాముడ్ని సృష్టించారని వ్యాఖ్యలు
  • రాముడిపై తనకు నమ్మకంలేదని వివరణ
Bihar former CM Jitan Ram Manjhi sensational comments on Lord Sri Ram

రామాయణం అనేది ఓ గాథ మాత్రమేనని, అందులో రాముడు ఓ పాత్ర అంటూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కలకలం రేపారు. రాముడి పాత్ర వాల్మీకి, తులసీదాస్ ల సృష్టి అని పేర్కొన్నారు. లోకానికి సందేశం ఇచ్చేందుకు వారు రాముడి పాత్రకు రూపకల్పన చేశారని వెల్లడించారు. రాముడు దేవుడు అనడంలో తనకు నమ్మకంలేదని జితన్ రామ్ మాంఝీ స్పష్టం చేశారు. 

"వాల్మీకి, తులసీదాస్ రామాయణం రాశారు... అందులో అనేక మంచి విషయాలు ఉన్నాయి... వాల్మీకి, తులసీదాస్ లను నమ్మవచ్చేమో కానీ, రాముడు దేవుడంటే నమ్మలేం" అని వ్యాఖ్యానించారు. "శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తిన్నాడని మీరు నమ్ముతారు... కానీ మేం కొరికి ఇచ్చిన ఎంగిలి పండ్లను మీరు మాత్రం తినరు.... కనీసం మేం తిన్నవాటిని తాకను కూడా తాకరు" అంటూ హిందుత్వ వాదులపై విమర్శలు చేశారు. దేశంలో రెండే కులాలు ఉన్నాయని, ఒకటి ఉన్నోళ్లు, రెండు లేనోళ్లు అని జితన్ రామ్ మాంఝీ పేర్కొన్నారు.  

మాంఝీ కుమారుడు సంతోష్ బీహార్ లోని బీజేపీ సంకీర్ణంలో మంత్రి కాగా, మాంఝీ సారథ్యంలోని హిందూస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) ఎన్డీయే భాగస్వామ్య పక్షం. అయినప్పటికీ మాంఝీ రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News