Akhanda Bharat: ‘అఖండ భారతం’ కల త్వరలోనే సాకారం: మోహన్ భగవత్

  • మరో 20-25 ఏళ్లలో అఖండ భారతం సిద్ధిస్తుందన్న స్వామి రవీంద్ర పూరి
  • ఆయన మాటలతో ఏకీభవిస్తానన్న ఆరెస్సెస్ చీఫ్
  • భారత్ తన లక్ష్యాన్ని చేరకుండా ఎవరూ అడ్డుకోలేరన్న మోహన్ భగవత్
Akhand Bharat will be a reality soon said RSS chief Mohan Bhagwat

’అఖండ భారత్’ కల త్వరలోనే సాకారమవుతుందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వచ్చే 20-25 ఏళ్లలో అఖండ భారత్ కల నిజమవుతుందని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు స్వామి రవీంద్ర పూరి(మహానిర్వాణి అఖాడా) ఇటీవల పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మోహన్ భగవత్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

స్వామి రవీంద్ర పూరి ప్రకటనతో తాను ఏకీభవిస్తానని భగవత్ చెప్పారు. అరబిందో వంటి తత్వవేత్తలు చెప్పినట్టు వాసుదేవుడి (శ్రీకృష్ణుడి) కోరిక మేరకు భారతదేశం ఎదుగుతుందని అన్నారు. ఇండియా గురించి స్వామి వివేకానంద, అరబిందో చెప్పిన మాటలను తాను విశ్వసిస్తానన్నారు. 

అఖండ భారతం విషయాన్ని తన సొంత లెక్కలతో చెబుతున్నాను తప్పితే జ్యోతిష్యశాస్త్రాన్ని అనుసరించి కాదని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ, స్వామి రవీంద్ర పూరి చెప్పిన దానిపై పూర్తి విశ్వాసం ఉందని మాత్రం చెప్పగలనని భగవత్ చెప్పారు. అది తప్పకుండా జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం మనం కదులుతున్న వేగంతోనే ముందుకెళ్తే 25-30 ఏళ్లలో అఖండ భారతం సిద్ధిస్తుందని, అందరం కలిసి మరింత వేగంగా ముందడుగు వేస్తే మాత్రం ఈ దూరాన్ని సగానికి సగం తగ్గించొచ్చని చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మంచిని కాపాడుతూ ఉండాలని, అలాగే దుష్టులను నాశనం చేయడం మర్చిపోకూడదని అన్నారు. భారత్ తన లక్ష్యాన్ని చేరకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆరెస్సెస్ చీఫ్ తేల్చి చెప్పారు.

More Telugu News