KTPP: ఆసుపత్రి బిల్లు చెల్లించలేక.. కోలుకున్న రోగి ఆసుపత్రిలోనే ఆత్మహత్య

  • కేటీపీపీ నిర్మాణం కోసం రెండెకరాల భూమిని కోల్పోయిన బాపు
  • కుమారుడికి ఉద్యోగం ఇస్తామన్న అధికారుల హామీ గాలికి
  • ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరిగిన బాపు
  • స్పందన లేకపోవడంతో కేటీపీపీ ముందే ఆత్మహత్యాయత్నం
  • చికిత్సకు రూ. 60 వేల బిల్లు
Patient committed suicide in hospital as he can not able to pay hospital bill

ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స అనంతరం కోలుకున్నాడు. అయితే, చికిత్సకు అయిన బిల్లును చెల్లించలేక ఆసుపత్రిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిందీ ఘటన.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెల్పూరులో కేటీపీపీ నిర్మాణంలో భాగంగా భూపాలపల్లి మండలం మహబూబ్‌పల్లికి చెందిన మర్రి బాపు (46) 2006లో తనకున్న రెండెకరాల భూమిని కోల్పోయాడు. బాపు నుంచి భూమిని తీసుకున్నప్పుడు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని జెన్‌కో అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం ఇవ్వకపోవడంతో వీలు దొరికినప్పుడల్లా కేటీపీపీ అధికారులను కలిసి తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని బాపు మొరపెట్టుకునేవాడు. 

ఈ ఏడాది మార్చి 30, 31 తేదీల్లోనూ అధికారులను కలిసి మరోమారు మొరపెట్టుకున్నాడు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ నెల 1న కేటీపీపీ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన అక్కడి సెక్యూరిటీ సిబ్బంది బాపును భూపాలపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నాడు. ఆసుపత్రి నిర్వాహకులు రూ. 60 వేల బిల్లును కేటీపీపీ సిబ్బందికి పంపారు. 

వారు చెల్లించేందుకు నిరాకరించడంతో బిల్లు కోసం బాపు కుటుంబ సభ్యులను అడిగారు. బిల్లు చెల్లిస్తేనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. దీంతో డబ్బుల కోసం వెళ్లిన వారు మూడు రోజులైనా రాకపోవడంతో మనస్తాపం చెందిన బాపు నిన్న ఉదయం ఆసుపత్రి వార్డులో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు వివిధ పార్టీల నాయకులు ఆసుపత్రికి చేరుకుని ధర్నా చేశారు. ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News