Reham Khan: ఇమ్రాన్ ఖాన్ ను జోకర్ లా తీసిపారేసిన మాజీ భార్య

Reham Khan terms her ex husband Imran Khan a comedian with more talent
  • ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్
  • బాలీవుడ్ లో ట్రై చేయాలన్న రెహామ్ ఖాన్
  • కామెడీ బాగా చేస్తాడంటూ ఎద్దేవా
  • కపిల్ శర్మ షోలో పాల్గొనాలని వ్యంగ్యం
పదవిలో ఉన్నప్పటి కంటే ఇప్పుడే తాను మరింత ప్రమాదకారినంటూ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓవైపు భీకర ప్రకటనలు చేస్తుంటే, ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ మాత్రం ఆయనను ఒక జోకర్ లా భావిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇక కపిల్ శర్మ కామెడీ షోలో చేరొచ్చని వ్యంగ్యం ప్రదర్శించారు. కపిల్ శర్మ కామెడీ షోలో నవజ్యోత్ సిద్ధూ స్థానాన్ని ఇమ్రాన్ ఖాన్ భర్తీ చేయాలని ఎద్దేవా చేశారు.  

కామెడీ చేసే టాలెంటు ఇమ్రాన్ ఖాన్ లో పుష్కలంగా ఉందని సెటైర్ వేశారు. ఇమ్రాన్ ఖాన్ భారత్ పై అదేపనిగా పొగడ్తలు కురిపిస్తుండడంపై రెహామ్ ఖాన్ స్పందించారు. బాలీవుడ్ లో తన అదృష్టమెలా ఉందో పరీక్షించుకోవాలని ఆమె సూచించారు. 

"అతడు తీవ్ర భావోద్వేగాలకు లోనైనట్టుంది. భారత్ అతడికి చోటిస్తుందని భావిస్తున్నట్టున్నాడు. బహుశా బాలీవుడ్ లో స్థానం దొరకొచ్చేమో! తప్పకుండా ఆస్కార్ అవార్డు స్థాయిలో నటనా ప్రతిభ కనబరుస్తాడు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఇమ్రాన్ ఖాన్ ను హీరోగా ప్రయత్నించమంటారా? లేక విలన్ గా ప్రయత్నించమంటారా? అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.... "బాలీవుడ్ లో హీరోలు విలన్ లు అవుతుంటారు, విలన్ లు కూడా ఎంతో ప్రజాదరణ పొందుతుంటారు. కానీ ఇమ్రాన్ విషయానికొస్తే అతడిలో కామెడీ చేసే సత్తా ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయొచ్చు" అని సలహా ఇచ్చారు. 

"ఒకవేళ బాలీవుడ్ కాదు పొమ్మంటే... ఎలాగూ కపిల్ శర్మ షోలో పాజీ (నవజ్యోత్ సింగ్ సిద్ధూ) స్థానం ఖాళీగా ఉంది కాబట్టి అందులో చేరొచ్చు" అంటూ ఇమ్రాన్ ఖాన్ ను తీసిపారేశారు. "పాజీ (నవజ్యోత్ సింగ్ సిద్ధూ)తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఇద్దరూ కలిసి కూడా షో చేసుకోవచ్చు" అని రెహామ్ ఖాన్ పేర్కొన్నారు.
Reham Khan
Imran Khan
Comedian
The Kapil Sharma Show
Comedy
Pakistan
Bollywood
Navjot Singh Sidhu
India

More Telugu News