మూవీ రివ్యూ: కేజీఎఫ్ 2

  • ఈ రోజే విడుదలైన 'కేజీఎఫ్ 2'
  • యష్ సరసన నాయికగా శ్రీనిధి శెట్టి
  • ప్రతినాయకుడి పాత్రలో సంజయ్ దత్ 
  • ఎమోషన్ తో ముడిపడిన యాక్షన్ మూవీ
KGF Movie Review

బంగారు గనుల చుట్టూ అల్లుకున్న మాఫియా నేపథ్యంలో 2018లో వచ్చిన 'కేజీఎఫ్' సంచలన విజయాన్ని సాధించింది. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ భారీ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. యష్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా, రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది.

ఈ ఒక్క సినిమాతో యష్ తిరుగులేని స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'కేజీఎఫ్ 2' ఈ రోజున థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా 'కేజీఎఫ్'ను స్థాయికి తగినట్టుగా ఉందా? అంతకుమించి ఆకట్టుకుందా? అనేది ఇప్పుడు చూద్దాం.

'గరుడ' పాత్ర చనిపోయిన తరువాత ఏం జరిగింది? అనే పాయింట్ నుంచి ఈ సెకండ్ పార్ట్ మొదలవుతుంది. 'గరుడ'ను రాఖీ భాయ్ (యశ్) అంతం చేస్తాడు. దాంతో అతని స్థానంలోకి గరుడ సోదరుడు విరాట్ రావడానికి  ట్రై చేస్తాడు. అతనిని కూడా చంపేసి 'కేజీఎఫ్' బంగారు గనులను రాఖీ తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. అంతవరకూ అక్కడి గనుల్లో పనిచేస్తూ అణచివేతకు లోనైన అక్కడి కూలీలంతా, రాఖీ చూపించే మానవత్వానికి కరిగిపోతారు. తమ బతుకులకు భరోసాను ఇచ్చిన ఆయనను ఒక దేవుడిలా భావిస్తుంటారు. ఇక మొదట్లో రాఖీని అపార్థం చేసుకున్న రీనా (శ్రీనిధి శెట్టి) ఆ తరువాత అర్థాంగిగా ఆయన జీవితంలోకి అడుగుపెడుతుంది. 

'కేజీఎఫ్'కి కొత్త బాస్ వచ్చాడనీ .. తల ఎగరేస్తే తల తీసేస్తాడనే విషయం, బంగారు గనులతో ముడిపడిన బిజినెస్ చేస్తున్న ఆయా ప్రాంతాల నాయకులకు తెలిసిపోతుంది. 'గరుడ' తరువాత కేజీఎఫ్ పై తమ ఆధిపత్యం నడుస్తుందని ఆశపడిన ముగ్గురు వ్యక్తులు, రాఖీకి కి వ్యతిరేకంగా చక్రం తిప్పడం మొదలుపెడతారు. 

గతంలో గరుడ బారి నుంచి తప్పించుకుపోయిన 'అధీర' (సంజయ్ దత్) ను రంగంలోకి దింపుతారు. అతని పేరు వింటేనే అక్కడి ప్రజలు భయపడిపోవడం. ఆయన కత్తికి ఎదురులేదని చెప్పుకోవడం రాఖీ భాయ్ వింటాడు. అతని ధైర్యసాహసాలను గమనించిన అధీర తన మొదటి తూటాతోనే రాఖీని నేలకూలుస్తాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఈ ఇద్దరి మధ్య సాగే పోరాటంలో చివరికి మిగిలేది ఎవరు? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

'కేజీఎఫ్' ను చూసిన వారికి 'కేజీఎఫ్ 2' ఎలా ఉంటుందనే విషయంలో కొంతవరకూ ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలకి తగినట్టుగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ కథను నడిపించాడు. ఒక వైపున తనని నమ్ముకున్న ప్రజలు .. మరో వైపున బంగారు గనులపై పట్టు కోసం కాచుకుని కూర్చున్న శత్రువులు .. ఇంకో వైపున  బంగారం విషయంలో తన తల్లికి ఇచ్చిన మాట .. మరో వైపున తల్లి కాబోతున్న బంగారం వంటి భార్య .. ఈ నాలుగు ప్రధానమైన అంశాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. హీరో ప్రధానమైన శత్రువులను ఏరేసుకుంటూ వెళుతూ .. నేరుగా ప్రధానిని ఫేస్ చేసే స్థాయికి వెళ్లడంతో కథ పతాకస్థాయికి చేరుకుంటుంది.

భారీ యాక్షన్ సీన్స్ వెనుక ..  చేజింగ్స్ వెనుక బలమైన ఎమోషన్స్ ఉండటం వలన ఆడియన్స్ కి వెంటనే కథ కనక్ట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ ప్రతి సన్నివేశాన్ని చాలా పట్టుగా రాసుకుని పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు. బంగారు గనుల నేపథ్యంలో వచ్చే సీన్స్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకునిపోతాయి. ఒక్కో శత్రువు ఆటకట్టిస్తూ రాఖీ భాయ్ ముందుకు వెళ్లే తీరును ఆసక్తికరంగా చూపించాడు. యష్ .. సంజయ్ దత్ ..  రవీనా టాండన్ పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది. అయితే  సంజయ్ దత్ లుక్ కి తగిన పవర్ఫుల్ డైలాగ్స్ లేకపోవడం కాస్త అసంతృప్తికి గురిచేస్తుంది.

 యశ్ పాత్రను  మాత్రం ప్రశాంత్ నీల్ చాలా స్టైలీష్ గా చూపించాడు. తల్లికి ఇచ్చిన మాట కోసం .. అన్ని బంగారు గనులున్న ఆయన ఒక్క బంగారు బిస్కట్ ను కూడా వదులుకోకపోవడం .. తన ప్రియురాలు ఉక్కపోస్తుందంటే హెలికాఫ్టర్ ఫ్యాన్ తో గాలి వచ్చేలా చేయడం ఆ పాత్ర స్వభావానికి అద్దం పడతాయి. శత్రువుల పట్ల కనికరం లేకుండా విరుచుకుపడే ఆయనకి, స్త్రీల పట్ల గల గౌరవం ఏ స్థాయిలో ఉందో కూడా చూపించారు. ఇక ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ పాత్రలు ఒక పరిథిలో కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు యాక్షన్ కి ఎమోషన్ ను జోడిస్తూ, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు.

ఇక ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు.  'తుఫాన్' .. 'ధీర ధీర' పాటలు సందర్భంలో నుంచే పుట్టుకుని  వస్తాయి. ఇక శ్రీనిధి శెట్టి వైపు  నుంచి సాగే 'మెహబూబా' పాట కూడా ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆయువు పట్టు. ఆ వైపు నుంచి రవి హండ్రెడ్ మార్కులు కొట్టేశాడు. భువన్ గౌడ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. బంగారు గనుల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు .. రెయిన్ ఫైట్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. కథాకథనాలు .. పాటలతో పాటు మాటల్లోను మంచి బలం కనిపిస్తుంది.  

'నేను ఈ ప్లేస్ కి మాత్రమే కొత్తమ్మా .. ఈ ఫీల్డ్ కి కాదు' .. 'ఇక్కడ తలలు శాశ్వతం కాదు .. కిరీటాలు ముఖ్యం' .. 'మంచం ఉన్నంత వరకే కాళ్లు చాపుకోవాలకునే రకం కాదు నేను .. కొత్త మంచం వేయించుకునే టైపు. 'రక్తంతో తడిసిన చరిత్ర ఇది  సిరాతో ముందుకు తీసుకుని వెళ్లలేం' .. 'పాము .. నిచ్చెన ఆటలోకి ఇప్పుడు ముంగీస దిగింది' .. 'మిమ్మల్ని మంచి  చేయనీయరు .. నన్ను మంచోడిని  అవనివ్వరు' .. 'నీళ్ల నుంచి నిప్పు పుట్టినట్టు చరిత్రలో లేదు' వంటి డైలాగ్స్ మనసును పట్టుకుంటాయి. 

'కేజీఎఫ్' ఫస్టు పార్టు చూసినవారికి ఈ  కథలో రొమాన్స్ కీ ..  రొమాంటిక్ పాటలకు .. కామెడీకి అవకాశం ఉండదనే  విషయం తెలుసు. నాన్ స్టాప్ యాక్షన్ సీన్స్ ను కలుపుకుంటూనే ఈ కథ నడుస్తుందని తెలుసు. అందువలన  'కేజీఎఫ్' ఫస్టు పార్టును ఇష్టపడినవారిని సెకండ్ పార్టు ఎంత మాత్రం నిరాశ పరచదనే చెప్పాలి. ఇది బంగారం కోసం సాగిన భారీ పోరాటంలా కాకుండా,  ఓ పల్లెటూరి తల్లి పట్టుదలకు సంబంధించిన కథగా .. ఆమెకి ఇచ్చిన మాటకు కట్టుబడిన ఓ  కొడుకు కథగా చూడాలనే చివరి లైన్ తో ఈ సినిమాను ఎమోషనల్ గా మరింత కనెక్ట్ చేయడానికి ప్రయత్నించిన తీరు బాగుంది.   

--- పెద్దింటి గోపీకృష్ణ

More Telugu News