Lakshman: బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ తగ్గించారు: లక్ష్మణ్

  • కేసీఆర్ అంబేద్కర్ ను, దేశ ప్రజలను అవమానించారన్న లక్ష్మణ్  
  • ఆయనకు సామాజిక స్పృహ లేదని విమర్శ 
  • జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉందని వ్యాఖ్య 
KCR decreased BC reservations says Lakshman

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానిస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం ద్వారా అంబేద్కర్ ను, భారత ప్రజలను కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాదులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ కు సామాజిక స్పృహ లేదని... జనాభాకు అనుకూలంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ తగ్గించారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతామని చెప్పారు. 

ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, అంబేద్కర్ ని యావత్ ప్రపంచం గుర్తించిందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం గుర్తించలేదని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. కేసీఆర్ దళితద్రోహి అని, కేవలం దళితుల ఓట్ల కోసమే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు.

More Telugu News