జ‌గ‌న్ వ్యాఖ్య‌లు వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించిన‌వే: జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

13-04-2022 Wed 16:05
  • నంద్యాల స‌భ‌లో జ‌గ‌న్ ప‌రుష వ్యాఖ్య‌లు
  • ఆ వ్యాఖ్య‌ల‌పై తాజాగా స్పందించిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి
  • విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న స‌భ‌లో ఆ వ్యాఖ్య‌లు త‌గివని ఖండ‌న‌
jc prabhakar reddy comments on jagan harsh comment
నంద్యాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా త‌న వెంట్రుక కూడా పీక‌లేరంటూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించి చేసిన‌వ‌న్న దానిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ నోట నుంచి వ‌చ్చిన ఆ వ్యాఖ్య‌లు వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి చేసిన‌వేనంటూ జేసీ చెప్పుకొచ్చారు. 

బుధ‌వారం అనంత‌పురంలో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రిని ఉద్దేశించి చేసినా.. విద్యా దీవెన పేరిట విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాలుపంచుకున్న స‌మావేశంలో జ‌గ‌న్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని జేసీ అభిప్రాయ‌ప‌డ్డారు. 

ఆయన నోట నుంచి ఈ వ్యాఖ్య‌లు వ‌చ్చినంత‌నే జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌నో, మ‌రొక‌రినో ఉద్దేశించి అన్నార‌ని అంతా అనుకున్నార‌ని, అయితే త‌న‌కు న‌చ్చిన వారికే కేబినెట్‌లో అవ‌కాశం ఇస్తాన‌న్న మెసేజ్‌ను ఎమ్మెల్యేల్లోకి పంపే దిశ‌గానే ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని జేసీ అన్నారు. ఈ వ్యాఖ్య ద్వారా తాను చెప్పిందే వేద వాక్కు అని వైసీపీ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ చెప్ప‌క‌నే చెప్పార‌ని జేసీ వ్యాఖ్యానించారు.