Shivam Dube: శివాలెత్తిన శివం దూబే, ఊతప్ప ఉతుకుడు... 216 పరుగుల భారీ స్కోరు చేసిన చెన్నై

  • డీవై పాటిల్ స్టేడియంలో పరుగుల వర్షం
  • 95 పరుగులు చేసిన శివమ్ దూబే
  • 5 ఫోర్లు, 8 సిక్సర్లతో విధ్వంసం
  • 50 బంతుల్లోనే 88 పరుగులు చేసిన ఊతప్ప
  • 9 సిక్సులు, 4 ఫోర్లు బాదిన సీనియర్ ఆటగాడు
Shivam Dube and Uthappa explosive batting guides CSK huge total

వరుస ఓటముల నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్... రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. మిడిలార్డర్ లో వచ్చిన యువ ఆల్ రౌండర్ శివమ్ దూబే పూనకం వచ్చినవాడిలా విరుచుకుపడగా, సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్ప వీరబాదుడు బాదాడు. దూబే 46 బంతుల్లో 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. 

అటు ఊతప్ప 50 బంతుల్లో 88 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 4 ఫోర్లు, 9 సిక్సులున్నాయి. శివమ్ దూబే, ఊతప్ప జోడీ ఆడుతున్నంత సేపు బెంగళూరు బౌలర్లు ఏ బంతి వేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. మీడియం పేసర్ ఆకాష్ దీప్ ఒక ఓవర్లో తీవ్ర ఒత్తిడికి లోనై, అనేక వైడ్లు విసిరాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా, బంతిని చితకబాది స్టాండ్స్ లోకి తరలించడమే తమ పని అన్నట్టుగా దూబే, ఊతప్ప బ్యాట్లు ఝుళిపించారు. 

ఇక, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 17 పరుగులు చేయగా, మొయిన్ అలీ 3 పరుగులు చేశాడు. కెప్టెన్ రవీంద్ర జడేజా (0) డకౌట్ అయినా, ఈ ఇన్నింగ్స్ లో పరుగులు వెల్లువెత్తడంతో అదేమంత పెద్ద విషయంలా కనిపించలేదు. 

కాగా, చివరి బంతికి సిక్స్ కొడితే సెంచరీ పూర్తవుతుందన్న నేపథ్యంలో, దూబే భారీ షాట్ కు యత్నించినా, అది బౌండరీ దాటలేదు. డుప్లెసిస్ క్యాచ్ పట్టినా, సరిగా బంతిని చేతిలో నిలపలేకపోవడంతో దూబే నాటౌట్ గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో వనింద హసరంగ 2 వికెట్లు తీయగా, హేజెల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు.

More Telugu News