CM KCR: రేపటి నుంచి మేమే ధాన్యం కొంటాం.... రైతులెవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దు: సీఎం కేసీఆర్ ప్రకటన

  • సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
  • కేంద్రంపై విమర్శనాస్త్రాలు
  • పియూష్ గోయల్ కు బుద్ధుందా? అంటూ ఆగ్రహం
  • దద్దమ్మ ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు
CM KCR hits out Center policies

ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై సమరభేరి మోగించిన సీఎం కేసీఆర్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని థాన్యం మొత్తం తామే కొంటామని వెల్లడించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు రైతులకు శుభవార్త చెప్పారు.  

యాసంగి ధాన్యంలో వ్యత్యాసాలను పరిశీలించి, కొనుగోళ్లపై విధివిధానాల కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీ వేసినట్టు తెలిపారు. రేపటి నుంచి తెలంగాణలో యుద్ధ ప్రాతిపదికన వడ్లు కొనుగోళ్లు చేపడతామని స్పష్టం చేశారు. రూ.1960 కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పారు. కొనుగోళ్లకు సంబంధించి నాలుగు రోజుల్లో ఏర్పాట్లు పూర్తవుతాయని, రైతులు ధాన్యాన్ని తక్కువకు అమ్ముకోవద్దని సూచించారు. 

2014 నుంచి 2022 వరకు చూస్తే తెలంగాణలో కోటి ఎకరాల మేర సాగుభూమి విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు. ఏ రాష్ట్రంలో పండించనంత పంటను తెలంగాణలో పండించడం జరిగిందని చెప్పారు. 24 గంటలు విద్యుత్ వల్ల పంటల దిగుబడులు పెరిగాయని వివరించారు. 

వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రం పావులు కదుపుతోందని విమర్శించారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయడమే కేంద్రం లక్ష్యంగా ఉందని అన్నారు. బావుల వద్ద విద్యుత్ మీటర్లు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తోందని తెలిపారు. ధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తే, నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి గర్వంతో మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. పియూష్ గోయల్ కు బుద్ధుంటే ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని అన్నారు.  

"దేశంలో ఎప్పుడైనా ఆహార భద్రత కాపాడాలంటే ఆహార నిల్వలు ఉండాలి... ఇది చాలా సాధారణ అంశం. ఇదేమీ బ్రహ్మపదార్థం కాదు. ఆహార భద్రత కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ వద్ద లక్షల కోట్ల టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది. రాష్ట్రాలు పండించిన పంటను ఫుడ్ కార్పొరేషన్ సేకరించి వితరణ చేసేటప్పుడు ఓ పది వేల కోట్ల రూపాయల మేర నష్టం రావొచ్చు... దాన్ని భరించాలి. కొన్ని సందర్భాల్లో ప్రపంచంలో కరవు వచ్చినప్పుడు ధాన్యం ఎగుమతి చేస్తే లాభాలు కూడా వస్తాయి. దీంట్లో నష్టాలు కూడా ఉంటాయి. అయితే ఆ నష్టాలను మేం భరించలేము అని చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉంది" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 

చమురు ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్న కేంద్రం... పన్ను తగ్గించాలంటూ రాష్ట్రాలకు చెబుతోందని అన్నారు. మరి కేంద్రం ఎలా పెంచుతోంది? ఎందుకోసం పెంచుతోంది? అని నిలదీశారు. నువ్వు పెంచుకోవచ్చు... మేం పెంచుకోకూడదా? అని మండిపడ్డారు. 

"బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ల సిద్ధాంతం ఏమిటంటే... బలమైన కేంద్రం-బలహీన రాష్ట్రాలు. రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీసి కేంద్రం ముందు చిప్ప పట్టుకుని నిలబడాలి. వాళ్ల చెప్పుచేతుల్లో ఉండాలి. ఇది పూర్తిగా సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండే దిక్కుమాలిన సిద్ధాంతం. అభివృద్ధి చెందిన, ప్రజాస్వామ్య పరంగా పరిణతి చెందిన దేశాల్లో కేంద్రం నుంచి అధికారాలు రాష్ట్రాలకు బదిలీ అవుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను కబళిస్తోంది" అని ఆరోపించారు.

More Telugu News