Pawan Kalyan: ఇంకొక్కసారి నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే జగన్ ను సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది: పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్

  • కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థికసాయం
  • అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటన
  • మీడియాతో మాట్లాడిన జనసేనాని
  • తమ గురించి మాట్లాడే అర్హత లేదంటూ ఆగ్రహం
Pawan Kalyan strong warning to YCP top brass

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తుండడం తెలిసిందే. అయితే దీనిపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు పవన్ నేడు ఆయా జిల్లాల్లో పర్యటించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. "మేం ప్రజల పక్షాన నిలబడి విధానాలపై మాట్లాడుతున్నాం. కానీ మీరు నన్ను సీబీఎన్ (చంద్రబాబునాయుడు)కు దత్తపుత్రుడు అంటున్నారు. ఈ అనంతపురం నుంచే వైసీపీ అగ్రనాయకత్వానికి చెబుతున్నా... ఇంకొక్కసారి గనుక నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే జగన్ ను సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. వాళ్ల పార్టీలోని చాలామంది ముఖ్య నాయకులను సీబీఐ దత్తత తీసుకుంటోంది. ఆ విషయం మర్చిపోవద్దు. 

అంతేకాదు, 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి మీరు జనసేన పార్టీని టీడీపీకి 'బీ-టీమ్' అంటున్నారు. దీనిపై ఏదన్నా గట్టిగా మాట్లాడితే మీరు ఏడుస్తారని ఊరుకున్నా. ఇక నాకు కూడా సహనం పోయింది. ఇకపై మమ్మల్ని గనుక 'బీ-టీమ్' అన్నారంటే మిమ్మల్ని 'చర్లపల్లి జైల్ షటిల్ టీమ్' అనాల్సి వస్తుంది. 

చర్లపల్లి జైల్లో చక్కగా 16 నెలలు షటిల్ ఆట ఆడుకున్నారు. మీరేమీ దేశ సేవ చేయలేదు. మీరేమీ సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ లు కాదు. మీరు ఆర్థిక నేరాలకు పాల్పడి జైల్లో కూర్చున్నవాళ్లు. మీరు మాకు నీతులు చెప్పకండి. మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. అసలు ఆ స్థాయి కూడా లేదు మీకు" అంటూ ఘాటుగా విమర్శించారు.

More Telugu News