Shehbaz Sharif: పాకిస్థాన్ కొత్త ప్రధాని షాబాజ్ కు మోదీ శుభాకాంక్షలు... కశ్మీర్ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన షాబాజ్

Modi congratulate Pakistan new prime minister Shehbaz Sharif
  • పాక్ లో గద్దె దిగిన ఇమ్రాన్ ఖాన్
  • నూతన ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎన్నిక
  • ప్రజాసంక్షేమం కోసం పనిచేద్దామన్న మోదీ
  • కశ్మీర్ అంశం తేలాకే మరేదైనా అంటూ షాబాజ్ వ్యాఖ్యలు
అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో ఓటమిపాలై అత్యంత అవమానకర పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడం తెలిసిందే. ఇమ్రాన్ స్థానంలో పీఎంఎల్-ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్ పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా షాబాజ్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగ్రవాదానికి తావులేని రీతిలో భారత్ శాంతి, సుస్థిరతలనే కోరుకుంటుందని స్పష్టం చేశారు. "అందుకే మనం అభివృద్ధి సవాళ్లపైనే దృష్టి నిలిపి, మన ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం పాటుపడదాం" అని పిలుపునిచ్చారు. 

కాగా, షాబాజ్ షరీఫ్ పాక్ ప్రధాని పీఠం ఎక్కారో, లేదో, కశ్మీర్ అంశంలో తమ నైజం బయటపెట్టుకున్నారు. భారత్ తో తాము సఖ్యతగా ఉండాలనే కోరుకుంటున్నామని, కానీ కశ్మీర్ అంశం తేలనిదే అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆర్టికల్ 370 రద్దు, అనేక చర్యల ఫలితంగా కశ్మీర్ లో ప్రజలు నెత్తురోడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశం తేలాకే ఇతర అంశాలపై దృష్టి పెడదామని భారత్ అధినాయకత్వానికి సూచించారు. కశ్మీరీలకు పాకిస్థాన్ ప్రభుత్వం నైతికపరమైన, దౌత్యపరమైన మద్దతు ఇస్తుందని షాబాజ్ పేర్కొన్నారు. 

పొరుగుదేశాలను ఎవరూ ఎంచుకోలేరని, పక్కన ఏ దేశం ఉంటే దానితో కలిసి వుండాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయితే, దేశ విభజన సమయం నుంచి భారత్ తో పాకిస్థాన్ కు మంచి సంబంధాలే లేవని, ఇది దురదృష్టకరమని వెల్లడించారు.
Shehbaz Sharif
Prime Minister
Pakistan
Narendra Modi
India

More Telugu News