Vijay: తాను మీడియాకు ఎందుకు దూరంగా ఉంటాడో వెల్లడించిన తమిళ హీరో విజయ్

Hero Vijay opined why he maintains distance to media
  • విడుదలకు సిద్ధమైన బీస్ట్
  • నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా చిత్రం
  • ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న విజయ్
తమిళ హీరో విజయ్ నటించిన బీస్ట్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో కలిసి హీరో విజయ్ మీడియా ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా విజయ్ తన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు, ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటారు. అలాంటిది బీస్ట్ ప్రచార కార్యక్రమాల్లో విజయ్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, తాను ఎందుకు మీడియాకు దూరంగా ఉంటాడో విజయ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు వివరించారు. 

పది, పదకొండేళ్ల క్రితం ఓ సంఘటనతో తాను మీడియాకు దూరమయ్యానని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో తాను ఒకటి చెబితే, వాళ్లు మరొకటి రాశారని ఆరోపించారు. మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని, అసలు ఆ వ్యాఖ్యలు చేసింది నేనేనా అని అనిపించిందని వివరించారు. నువ్విలా మాట్లాడావంటే నమ్మలేకపోతున్నాం అని సన్నిహితులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారని విజయ్ వెల్లడించారు. 

ఏదేమైనా నాడు తాను అనని మాటలు అన్నట్టుగా రాశారని, దాంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయని తెలిపారు. ఇంట్లో వాళ్లకు వాస్తవాలేంటో తెలుసని, కానీ బయటి వాళ్లందరికీ సర్దిచెప్పలేను కదా? అని వ్యాఖ్యానించారు. అప్పట్నించి మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు విజయ్ స్పష్టం చేశారు.
Vijay
Media
Beast
Kollywood

More Telugu News