Punjab: ఇదేం కామెడీ సర్కస్ కాదు.. పంజాబ్ సీఎం మాన్ పై విమర్శల వెల్లువ

This Is Not Comedy Circus Punjab CM Comes Under Fire as His Statement Goes Viral
  • ఉద్యోగం కోసం విదేశీయులు పంజాబ్ కు వస్తారన్న సీఎం
  • మండిపడిన కాంగ్రెస్ మాజీ మంత్రి
  • ముందు స్థానికులకు ఉద్యోగాలివ్వాలంటూ మండిపాటు
  • ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీత
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై విమర్శల జడివాన కురుస్తోంది. కాంగ్రెస్ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. శనివారం బటిండాలోని మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఏదో ఒక రోజు ఉద్యోగం చేసేందుకు విదేశీయులు రాష్ట్రానికి వస్తారని వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ పంజాబ్ నేతలు మండిపడుతున్నారు. ఇదేమీ కామెడీ సర్కస్ కాదంటూ వ్యాఖ్యానించారు. 

'స్థానికుల సమస్యలను తీర్చే శక్తి లేదుగానీ.. విదేశీయులుకు ఉద్యోగాలిస్తారట..' అంటూ కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ మంత్రి రాజ్ కుమార్ వెర్కా ఎద్దేవా చేశారు. ఉచిత హామీలతో పంజాబ్ ప్రజలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తొలుత నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 

‘‘ఉద్యోగం లేకుండా ఆవేదన చెందుతున్న పంజాబ్ నిరుద్యోగులకు ముందు జాబ్ లు ఇవ్వండి. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఏమైంది? మహిళలకు రూ.వెయ్యి హామీ ఎటుపోయింది? పంజాబ్ లో పనిచేసేందుకు వచ్చే విదేశీ మహిళలకు కూడా సీఎం భగవంత్ మాన్ రూ.వెయ్యి ఇస్తారా? వేరే దేశాల నుంచి జాబ్ ల కోసం ఇక్కడకు వచ్చే వారికీ ఉచిత విద్యుత్ ను అందిస్తారా? ఇది కామెడీ సర్కస్ కాదు.. కొంచెం సీరియస్ గా ఉండండి’’ అంటూ వెర్కా ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలోనూ ఆప్ ఇప్పుడు నాటకాలకు తెరదీస్తోందని ఆరోపించారు.
Punjab
Bhagwant Mann
Chief Minister
AAP
Congress

More Telugu News