Roja: సినిమాలు, జబర్దస్త్ కు దూరం: రోజా సంచలన ప్రకటన

Will stay away from movies and Jabardasth says Roja
  • కాసేపట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న రోజా
  • మంత్రిగా సమర్థవంతంగా పని చేస్తానని ధీమా  
  • సీఎం జగన్ పై అభిమానం రెట్టింపయిందని వ్యాఖ్య
సినిమాలు కానీ, రాజకీయాలు కానీ... రెండు రంగాల్లో రోజా తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపును పొందారు. సినిమా హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఆమె వెలుగొందారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

టీడీపీలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వైసీపీలోకి మారిన తర్వాత కానీ... ప్రత్యర్థులపై ఆమె విరుచుకు పడిన తీరు ఒక రేంజ్ లో ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన రోజా... పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు. ఆమె అంకితభావాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్... ఆమెను మంత్రి పదవికి ఎంపిక చేశారు. కాసేపట్లో ఆమె రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి లభించినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై తన అభిమానం రెట్టింపయిందని చెప్పారు. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖను కేటాయించినా సమర్థవంతంగా పని చేస్తానని తెలిపారు. 

ఇదే సమయంలో ఆమె సంచలన ప్రకటన చేశారు. సినిమాలకు, జబర్దస్త్ షోకు గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించారు. మంత్రిగా పూర్తి సమయాన్ని తాను వెచ్చించాల్సి ఉంటుందని... ఈ సమయంలో సినిమాలు, షోలకు సమయం కేటాయించలేనని ఆమె తెలిపారు. మంత్రి అవడంతో ఇక షూటింగులు మానేస్తున్నానని అన్నారు. మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు.

టీడీపీ నేతలు తనను ఐరన్ లెగ్ అంటూ ప్రచారం చేస్తే... జగనన్న తనను మంత్రిని చేశారని రోజా కొనియాడారు. ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పని చేస్తానని చెప్పారు.
Roja
YSRCP
Cinemas
Jabardasth
Jagan

More Telugu News