Sehwag: టెండుల్కర్, ధోనీకి కూడా ఓటమి తప్పలేదు.. జడేజా నువ్వు చేయాల్సింది ఇదే: సెహ్వాగ్

  • విమర్శలు, వార్తలను పట్టించుకోకు
  • ఆటపైనే దృష్టి పెట్టు
  • మొబైల్, టీవీ కట్టేయి
  • వార్తా పత్రికలను చూడొద్దు
  • గదిలో వీడియో గేమ్ లతో ఎంజాయ్ చేయి
  • సీఎస్కే కెప్టెన్ కు సెహ్వాగ్ సూచనలు
Sehwag offers crucial advice to Jadeja amid CSKs disastrous start

ఓటమి భారాన్ని ఎదుర్కొంటున్న సీఎస్కే కెప్టెన్ రవీంద్ర జడేజాకు మాజీ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచనలు చేశాడు. ఐపీఎల్ తాజా ఎడిషన్ లో సీఎస్కే ఆడిన నాలుగు మ్యాచుల్లోను ఓడిపోవడం తెలిసిందే. ఆఖరికి బలహీన జట్టుగా పేరున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను కూడా ఓడించలేకపోయింది. దీంతో సెహ్వాగ్ స్పందించాడు. 

‘‘జడేజాకు నేనిచ్చే సూచన ఏంటంటే ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. వాటి గురించి పట్టించుకోవద్దు. నీవు వాటి గురించి ఆలోచిస్తుంటే మైదానంలో ఆటపై దృష్టి పెట్టలేవు. ఎందుకంటే నిర్ణయం తీసుకున్న ప్రతి సందర్భంలోనూ ఆలోచిస్తూనే ఉండాల్సి వస్తుంది. వారు ఏం అనుకుంటున్నారు, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, జట్టు సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారు? అని ఆలోచిస్తూ కూర్చుంటే నీవు సరైన నిర్ణయాలు తీసుకోలేవు.

నీ ఫోన్ ను ఎయిర్ ప్లేన్ మోడ్ లో పెట్టు. కరోనా సమయంలో వార్తా పత్రికలు ఇచ్చేవారు లేరు. టీవీని కూడా ఆఫ్ చేసే ఉంచు. గదిలోనే ఉండి ఆస్వాదించు. నీవు ఈ వార్తలను ఎక్కువగా చదువుతూ, పట్టించుకుంటుంటే నీ మనసు ఏకాగ్రత దెబ్బతింటుంది. సోషల్ మీడియాలో అప్ డేట్ ఇవ్వాలని అనిపించినప్పుడే ఎయిర్ ప్లేన్ మోడ్ తీసేసి, తర్వాత మళ్లీ అదే పనిచేయాలి.

టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ ఇలా ఎంతో మందిని చూశాను. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారు మొబైల్ ఫోన్ వైపు చూడలేదు. టీవీలు, వార్తా పత్రికలను కూడా పట్టించుకోలేదు. జడేజా కూడా దీన్ని సాధన చేయాలి. వీడియో గేమ్ లు ఆడుకుని ఎంజాయ్ చేయాలి’’అని సెహ్వాగ్ సూచించాడు.

More Telugu News