SRH: ఐపీఎల్ లో ఎట్టకేలకు 'విన్' రైజర్స్... చెన్నైని చిత్తు చేసిన ఆరెంజ్ ఆర్మీ

  • తొలి విజయంతో మురిసిన సన్ రైజర్స్
  • ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో ఓటమి
  • నేడు చెన్నైపై 8 వికెట్లతో భారీ విజయం
  • అద్భుతంగా ఆడిన అభిషేక్ శర్మ
Sunrisers registered first victory in ongoing IPL season by beating CSK

ఐపీఎల్ తాజా సీజన్ లో తొలి రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ్టి మ్యాచ్ లో అద్భుత విజయం నమోదు చేసింది. మరో మ్యాచ్ ఓడితే ఒత్తిడి మరింత పెరిగిపోతుందన్న నేపథ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్ తో పోరులో ప్రణాళికాబద్ధంగా ఆడి టోర్నీలో తొలి గెలుపును రుచిచూసింది. 155 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఓపెనర్ అభిషేక్ శర్మ సమయోచితంగా విజృంభించి 50 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. అభిషేక్ స్కోరులో 5 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. మరో ఎండ్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడి 32 పరుగులు చేసి, అభిషేక్ శర్మకు సరైన సహకారం అందించాడు. రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. త్రిపాఠి 5 ఫోర్లు, 2 సిక్సులు సంధించాడు. 

సన్ రైజర్స్ జట్టు విజయలక్ష్యాన్ని కేవలం 17.4 ఓవర్లలోనే అందుకోవడం విశేషం. చెన్నై బౌలర్లలో ముఖేశ్ చౌదరి 1, బ్రావో 1 వికెట్ తీశారు. ఈ విజయంతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో కాస్త పైకి ఎగబాకగా, చెన్నై జట్టు ఆడిన 4 మ్యాచ్ లలో 4 ఓటములతో మరింత దిగజారింది.

టాస్ గెలిచిన బెంగళూరు... ముంబయికి బ్యాటింగ్

కాగా, ఐపీఎల్ లో నేటి రెండో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలో గెలుపు బోణీ కొట్టలేకపోయిన ముంబయి... ఈ మ్యాచ్ లో సర్వశక్తులు ఒడ్డాలని కృతనిశ్చయంతో ఉంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో జరిగే ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టులో రెండు మార్పులు చేశారు. టైమల్ మిల్స్ స్థానంలో జయదేవ్ ఉనద్కత్, డానియల్ శామ్స్ స్థానంలో రమణ్ దీప్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇక, ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ క్వారంటైన్ పూర్తి చేసుకున ఈ మ్యాచ్ లో బరిలో దిగుతున్నాడు. మ్యాక్స్ వెల్ రాకతో బెంగళూరు బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది. మ్యాక్స్ వెల్ కోసం రూథర్ ఫర్డ్ ను తప్పించారు.

  • Loading...

More Telugu News