Eatala Rajendar: టీఆర్ఎస్ సర్కారును శిశుపాలుడితో పోల్చిన ఈటల

  • టీఆర్ఎస్ సర్కారు 100 తప్పులు చేసిందన్న ఈటల
  • అందుకే ప్రజలు తనను గెలిపించారని వెల్లడి
  • 101వ తప్పుకు కూడా శిక్షిస్తారని వ్యాఖ్యలు
Eatala comments on TRS govt

టీఆర్ఎస్ సర్కారు నుంచి, పార్టీ నుంచి అవమానకర రీతిలో ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఆపై ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే. ఈ క్రమంలో ఈటల అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ సర్కారును తూర్పారబడుతున్నారు. 

తాజాగా, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శిశుపాలుడితో పోల్చారు. టీఆర్ఎస్ సర్కారు ఇప్పటిదాకా శిశుపాలుడి తరహాలో 100 తప్పులు చేసిందని, 101వ తప్పుకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చేసిన 100 తప్పులకు పరిహారంగా ప్రజలు తనను గెలిపించారని ఈటల ఉద్ఘాటించారు. 

కేసీఆర్ తాను తప్పులు చేస్తూ, రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇది కంప్యూటర్ యుగం అయినా, అన్నం పెట్టేది భూమాతేనని స్పష్టం చేశారు. అలాంటి వ్యవస్థను కాపాడకుండా, వరి వేస్తే ఉరి అంటున్నారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో కిసాన్ మోర్చా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News