UK: భార్య పన్నుల వివాదం: బ్రిటన్ ప్రధానిగా రుషీ సూనక్ కష్టమే!

  • భారీగా పడిపోయిన అవకాశాలు
  • ఇన్నాళ్లూ రేసులో ముందున్న రుషి 
  • విమర్శలు ఎక్కుపెడుతున్న ప్రతిపక్ష నేతలు  
  • అవకాశాలు 35 శాతం నుంచి 12 శాతానికి పడిపోయిన వైనం
Rushi Sunak Chances Of Becoming Britain PM Drastically Down Graded

భార్య పన్నుల వివాదం బ్రిటన్ ఆర్థిక మంత్రి రుషీ సూనక్ కు ‘ప్రధాని’ అయ్యే అవకాశాలను భారీగా తగ్గించేసింది. నెల క్రితం వరకు ఆయన్ను ప్రధాని కావాలని 35 శాతం మంది కోరుకోగా.. ఇప్పుడు పదవి రేసులో ఉన్న మరో నేత లిజ్ ట్రస్ కు సమానంగా నిలిచారు. కేవలం 12 శాతమే రుషికి ప్రధాని అయ్యే అవకాశాలున్నాయి. 

రుషి భార్య అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఆమెకు సంస్థలో 0.9 శాతం వాటా ఉంది. అయితే, ఆ సంస్థ మీద వస్తున్న ఆదాయానికి ఆమె పన్నులు చెల్లించడం లేదు. ఇప్పటికీ ఆమె భారత పౌరసత్వం మీదే ఉన్నందున విదేశీ ఆదాయంపై పన్ను కట్టాల్సిన అవసరం లేదని బ్రిటన్ చట్టాలు చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే ఆమె ఇండియాలోని సంపాదనకు బ్రిటన్ లో పన్ను చెల్లించడం లేదు. దీంతో రుషీ సూనక్ పై ప్రతిపక్ష లేబర్ పార్టీ సభ్యులు విమర్శలు ఎక్కు పెట్టారు. దీంతో బ్రిటన్ లోని అన్ని ప్రముఖ పత్రికలూ ఈ వ్యవహారాన్ని మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించాయి. 

ఈ వ్యవహారంపై స్పందించిన అక్షత.. తన ప్రపంచవ్యాప్త ఆదాయంపై బ్రిటన్ లో పన్ను కట్టేస్తానని అన్నారు. తన విదేశీ పౌరసత్వం రుషి భవిష్యత్ కు అడ్డు కారాదని అక్షత అన్నారు. నిబంధనలు, చట్టం ప్రకారం తాను పన్ను కట్టాల్సిన అవసరం లేకపోయినా.. తాను పన్ను కట్టేందుకు సిద్ధమవుతున్నానని ఆమె అన్నారు. వాస్తవానికి బ్రిటన్ చట్టాల ప్రకారం అక్షతా మూర్తి ఎక్కడా ఎలాంటి తప్పూ చేయలేదు. అయితే, కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఆమె పన్ను కట్టకపోవడంపైనే ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ వ్యవహారంపై ఇటు రుషి కూడా స్పందించారు. కావాలనే తన భార్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేశారు. మాతృదేశంతో సంబంధాలు తెంచేసుకోవాలనడం సబబు కాదన్నారు. తాను ఈ దేశ పౌరుడిని ఎలాగో.. ఈ దేశ పౌరసత్వంతో ఎలా ఉన్నానో.. అక్షత కూడా తన దేశ పౌరసత్వంతో ఉండేందుకే ఇష్టపడుతోందని చెప్పారు. తాను తన దేశాన్ని ప్రేమించినట్టే అక్షత కూడా తన దేశాన్ని ప్రేమిస్తోందని తెలిపారు.   

మరి, ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగిపోతుందా? మళ్లీ రుషీకి ప్రధాని అయ్యే అవకాశాలు మెరుగవుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.

More Telugu News