రాజకీయ పార్టీల ఉచిత పథకాల హామీలను కట్టడి చేయలేం: సుప్రీంకోర్టుకు ఈసీ నివేదన

  • అందుకు చట్టంలో నిబంధనలు లేవని నివేదన 
  • అలాంటప్పుడు తాము చర్యలు తీసుకోలేమని వెల్లడి 
  • కావాలంటే కోర్టు మార్గర్శకాలు రూపొందించొచ్చని వ్యాఖ్య 
  • పార్టీల నిర్ణయాలపై ఓటర్లే తేల్చుకోవాలన్నఈసీ 
Cant Control Parties Freebies Promises Poll Panel Tells Supreme Court

రాజకీయ పార్టీలు ప్రకటించే హామీలను, ఉచిత పథకాలను కట్టడి చేయలేమని, ఇందుకు చట్టంలో నిబంధనలు లేవని భారత ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీం కోర్టుకు తెలియజేసింది. చట్టంలో నిబంధనలు లేకుండా చర్యలు తీసుకుంటే అది అతిక్రమణ అవుతుందని పేర్కొంది. కావాలంటే కోర్టు మార్గదర్శకాలు జారీ చేయవచ్చని సూచించింది. 

ఉచిత తాయిలాలు ప్రకటించే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎన్నికల సంఘం అఫిడవిట్ ను దాఖలు చేసింది.

‘‘విజయం సాధించిన రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు.. రాష్ట్రాల విధానాలను, నిర్ణయాలను ఈసీ శాసించలేదు. చట్టంలో ఇందుకు నిబంధనలు లేకుండా చర్యలు తీసుకుంటే పరిధి దాటినట్టు అవుతుంది. రాజకీయ పార్టీలు ప్రకటించే పథకాలు, నిర్ణయాలు ఆర్థికంగా ఆచరణ సాధ్యమేనా? లేదా? రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయా? అన్నది ఓటర్లే నిర్ణయించుకోవాలి’’ అంటూ ఈసీ తన అఫిడవిట్ లో సుప్రీం కోర్టుకు తెలిపింది.

More Telugu News